ఈసారి ఎన్నికల ఖర్చు 60 వేల కోట్లు !
60 వేలకోట్లు. అవును మీరు చదివింది నిజమే ! 60 వేల కోట్లు ఈ సారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీలు ఖర్చు చేశాయి. 2014 ఎన్నికల్లో 30 వేల కోట్లు ఖర్చు చేస్తే… ఈ సారి అంతకు మించి రెట్టింపు ఖర్చు పెట్టారని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 6.5 బిలియన్ డాలర్లు అంటే 45 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు […]
60 వేలకోట్లు. అవును మీరు చదివింది నిజమే ! 60 వేల కోట్లు ఈ సారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీలు ఖర్చు చేశాయి. 2014 ఎన్నికల్లో 30 వేల కోట్లు ఖర్చు చేస్తే… ఈ సారి అంతకు మించి రెట్టింపు ఖర్చు పెట్టారని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 6.5 బిలియన్ డాలర్లు అంటే 45 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఓపెన్ సీక్రెట్. ఓఆర్‌జీ అనే సంస్థ ట్రాక్ చేసింది. కానీ 2019 భారత ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు మాత్రం విపరీతంగా ఖర్చు చేశారు. ఎన్నికల వ్యయంలో అగ్రరాజ్యాన్ని కూడా వెనక్కి నెడుతూ 60 వేల కోట్ల ధన ప్రవాహం కొనసాగిందని సీఎంఎస్ రిపోర్టు పేర్కొంది.
దేశంలో ప్రతిలోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు వందకోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. ఓటుకు సగటున 700 రూపాయలు పంచిపెట్టారని లెక్కగట్టింది.దేశ వ్యాప్తంగా 60 వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో మేజర్ వాటా బీజేపీదేనని సీఎంఎస్ రిపోర్టు పేర్కొంది. మొత్తం ఖర్చులో దాదాపు 45 శాతం బీజేపీదేనని నివేదిక లెక్క గట్టింది. కాంగ్రెస్ పార్టీ ఖర్చు 15 నుంచి 20 శాతం ఉందని తెలిపింది.
2009లో 20 వేల కోట్లు, 2014 వచ్చే సరికి 30 వేల కోట్లను పార్టీలు కుమ్మరించాయి. కానీ ఈ సారి చూస్తే ఏకంగా 60 వేల కోట్లకు చేరింది. గత 20 ఏళ్లలో బీజేపీ ఎన్నికల వ్యయం స్థిరంగా పెరుగుతుండగా…. 2009 తర్వాత కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు తగ్గతూ వచ్చింది.
ఈ ఎన్నికల్లో 75 నుంచి 80 లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి 40 కోట్లకు మించి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. యూపీలో అమేథీ, అజామ్‌గఢ్, కర్నాటకలో మాండ్య, షిమోగ లోక్‌సభ స్థానాల్లో విపరీతంగా ఖర్చు పెట్టారు. 2019 ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 3475 కోట్లు స్వాధీనం చేసుకుని ఈసీ పాత రికార్డులు బద్దలుకొట్టింది. గత లోక్‌సభ ఎన్నికల్లో సీజ్ చేసిన మొత్తం కంటే ఇదిమూడు రెట్లు ఎక్కువ. పెద్ద ఎత్తున డబ్బు,బంగారం పట్టుబడిన జాబితాలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే… ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. మొత్తానికి 2019 సాధారణ ఎన్నికలు ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి.