తెలుగు రాష్ట్ర్రాల్లో కాంగ్రెస్... ఇక కష్టమే
ఆ పార్టీకి తెలుగు రాష్ట్ర్రాలు కంచుకోట. ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీలతోనే కేంద్రంలో రెండుసార్లు అధికారాన్ని అందుకుంది హస్తం. 1978లో ఎమర్జన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతింటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 42 స్థానాలకు గానూ 41 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు తెలుగువాళ్ళు. అంతటి ఖ్యాతి గడించిన ఆ పార్టీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గడ్డు పరిస్ధితి ఎదుర్కొంటోంది. ఎన్నో సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర […]
ఆ పార్టీకి తెలుగు రాష్ట్ర్రాలు కంచుకోట. ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీలతోనే కేంద్రంలో రెండుసార్లు అధికారాన్ని అందుకుంది హస్తం. 1978లో ఎమర్జన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతింటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 42 స్థానాలకు గానూ 41 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు తెలుగువాళ్ళు. అంతటి ఖ్యాతి గడించిన ఆ పార్టీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గడ్డు పరిస్ధితి ఎదుర్కొంటోంది.
ఎన్నో సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడం వల్ల, రాజశేఖర్ రెడ్డి కొడుకుగా గుర్తింపు పొందిన జగన్‌ను జైలులో పెట్టడం వల్ల, ఆ కేసుల్లో రాజశేఖర్ రెడ్డిని కూడా దోషిని చేయడం వల్ల తెలుగు ప్రజలు చాలా ఆగ్రహించారు. ఆనాటి నుంచి ఆ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారింది.
తెలంగాణకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 19 స్థానాల్లోనే విజయాన్ని అందించారు. తాజా రాజకీయ పరిణామాలలో ఆ పంతొమ్మిది స్ధానాలలో ఆరు మాత్రమే మిగిలాయి. మిగిలిన వారంతా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం అయిపోయారు. ఇది కాంగ్రెస్ కు తగిలిన అతి పెద్ద షాక్. ఈ మధ్యనే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చతికిల పడిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో విలీనం కావడంతో ఆ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినట్టుగానే కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణ కాంగ్రెస్ లో కాసింతైనా ఊపిరి ఉండేదని, అక్కడ కూడా అధికారం అందకపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ అంపశయ్య మీద నుంచి కోలుకునే పరిస్థితి ఉండదంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ అయితే కాంగ్రెస్ పార్టీ మనుగడ తుడిచిపెట్టుకు పోయింది. రాష్ట్ర్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు నుంచి మూడు శాతం ఓట్లు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ శాతం ఒకటికి పడిపోయింది. దారుణం ఏమిటంటే నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కూడా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు తక్కువ వచ్చాయంటే ఆ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తెలుస్తోంది.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ పార్టీని కనీసం చర్చల్లోకి కూడా రానివ్వడం లేదు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలు కూడా కాంగ్రెస్ పార్టీని ఎదగనివ్వవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మనుగడ మరుగున పడిపోనట్లేనని అంటున్నారు.