జనసేన నాయకులు తలోవైపు....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాళీ అవుతోంది. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన జనసేన నాయకులు, కార్యకర్తలు తమ దారి తాము చూసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వైవిధ్యమైన పార్టీ అని, యువతకు ఈ పార్టీ పట్ల ఎంతో సానుకూలత ఉందని జనసేన నాయకులు భావించారు. శాసనసభ ఎన్నికలలో 30 స్థానాలు, నాలుగైదు లోక్ సభ స్థానాలు గెలుచుకుంటామని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాళీ అవుతోంది. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన జనసేన నాయకులు, కార్యకర్తలు తమ దారి తాము చూసుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వైవిధ్యమైన పార్టీ అని, యువతకు ఈ పార్టీ పట్ల ఎంతో సానుకూలత ఉందని జనసేన నాయకులు భావించారు. శాసనసభ ఎన్నికలలో 30 స్థానాలు, నాలుగైదు లోక్ సభ స్థానాలు గెలుచుకుంటామని జనసేన నాయకులు ప్రకటనలు కూడా చేశారు.
అయితే పరిస్థితి పూర్తిగా తారుమారయింది. తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయారు. అనేకచోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. దీంతో జనసేనలోనే కొనసాగితే చేతి చమురు వదిలించుకోవడం మినహా ప్రయోజనం ఉండదని జనసేన నాయకులు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు కొందరు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైపు మరికొందరు చేరాలనుకుంటున్నట్లుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటుదాం అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించినా… జనసేన పట్ల ప్రజల్లో సానుకూలత లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసిన ఖర్చులు చాలునని, ఇక జనసేనకు దూరంగా ఉండాలని సీనియర్ నాయకులు, కార్యకర్తలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అధికారంలో ఉన్న పార్టీలో చేరితే నాయకులుగా మనుగడ ఉంటుందని, భవిష్యత్తులో మేలు జరుగుతుందని జనసేన నాయకులు భావిస్తున్నారు. సీనియర్ నాయకులు కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో, మరికొందరు నాయకులు భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఐదు సంవత్సరాలు పాటు జనసేన పార్టీని నడిపించడం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు సాధ్యం కాదని, ఆయన తన సినీ రంగం వైపు వెళ్లిపోతారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ముందే సర్దుకుంటే మంచిదనే ఆలోచనలో నాయకులు ఉన్నట్లుగా చెబుతున్నారు.