Telugu Global
NEWS

బీజేపీ రాజకీయ పునరేకీకరణ....

తెలంగాణ రాష్ర్ట సమితి 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, టీడీపీ శాసనసభ్యులు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. అయితే ఇవి ఫిరాయింపులు కావని, కొత్తగా ఏర్పడిన తెలంగాణను అన్ని రంగాలలో బలోపేతం చేసేందుకు జరుగుతున్న రాజకీయ శక్తుల పునరేకీకరణ అని సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికలలోనూ టీఆర్ఎస్ 88 సీట్లలో గెలుపొంది స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. అయినా, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోవడానికి క్యూ కట్టారు. […]

బీజేపీ రాజకీయ పునరేకీకరణ....
X

తెలంగాణ రాష్ర్ట సమితి 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, టీడీపీ శాసనసభ్యులు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. అయితే ఇవి ఫిరాయింపులు కావని, కొత్తగా ఏర్పడిన తెలంగాణను అన్ని రంగాలలో బలోపేతం చేసేందుకు జరుగుతున్న రాజకీయ శక్తుల పునరేకీకరణ అని సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు.

2018 లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికలలోనూ టీఆర్ఎస్ 88 సీట్లలో గెలుపొంది స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. అయినా, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోవడానికి క్యూ కట్టారు. ఇలా మాంచి ఊపు మీదున్న ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికల ఫలితాలు పెద్ద కుదుపునే ఇచ్చాయి.

ఏడు ఎంపీ స్థానాలలో ఓటమి పాలు కావడమే కాకుండా, గెలిచిన స్థానాలలోనూ మెజారిటీలు తగ్గు ముఖం పట్టాయి. దీంతో కంగు తిన్న టీఆర్ఎస్ నేతలు నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు.

ఈ క్రమంలోనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎవ్వరూ సాంకేతికంగా టీఆర్ఎస్ లో చేరలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తెలంగాణలో నాలుగు సీట్లు గెలుపొంది… కేంద్రంలో ఒక కీలక శాఖకు సహాయ మంత్రి పదవిని కూడా సాధించుకున్న బీజేపీ ఇక్కడ రాజకీయ పునరేకీకరణకు శ్రీకారం చుడుతోందని అంటున్నారు.

కేంద్రంలో కిషన్ రెడ్డికి మంత్రి పదవి లభించడం, అగ్రవర్ణాలకు కూడా పది శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం తదితర కారణాలతో తెలంగాణలో కీలకంగా ఉన్న రెడ్డి నాయకులు బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు.

తెలంగాణ టీడీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి ఢిల్లీలో కిషన్ రెడ్డిని కలవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అధికార పార్టీతోపాటు ఇతర పార్టీలలో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన కీలక నేతలను ఆకర్షించేందుకు బీజేపీ యత్నిస్తోందని అంటున్నారు.

2024 ఎన్నికల వరకు బీజేపీని తెలంగాణలో బలమైన శక్తిగా రూపొందించేందుకు వారు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించారని చెబుతున్నారు. కానీ, కేసీఆర్ వ్యవహార శైలిని తెలిసిన కొందరు రాజకీయ పరిశీలకులు మాత్రం దీనిని కొట్టి పడవేస్తున్నారు. వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన గులాబీ దళపతి బీజేపీని నిలువరించేందుకు అన్ని యత్నాలు చేస్తారని అంటున్నారు.

First Published:  2 Jun 2019 12:10 AM GMT
Next Story