Telugu Global
NEWS

కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు..!

“ఇకనుంచి కాంట్రాక్టులపై నిర్ణయాన్ని జ్యుడీషియల్ కమిషన్ తీసుకుంటుంది. జ్యుడీషియల్ కమిషన్ ఆమోదంతోనే టెండర్లు ఇస్తాం. వీటిపై కూడా ఎవరైనా రాద్ధాంతం చేస్తే పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనుకాడేది లేదు” ఇవి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటలు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పనుల తీరు, కొత్త పనులపై వ్యవహరించే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తేటతెల్లం చేశారు. వివిధ కాంట్రాక్టులకు సంబంధించి ఇంతవరకు […]

కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు..!
X

“ఇకనుంచి కాంట్రాక్టులపై నిర్ణయాన్ని జ్యుడీషియల్ కమిషన్ తీసుకుంటుంది. జ్యుడీషియల్ కమిషన్ ఆమోదంతోనే టెండర్లు ఇస్తాం. వీటిపై కూడా ఎవరైనా రాద్ధాంతం చేస్తే పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనుకాడేది లేదు” ఇవి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటలు.

నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పనుల తీరు, కొత్త పనులపై వ్యవహరించే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తేటతెల్లం చేశారు. వివిధ కాంట్రాక్టులకు సంబంధించి ఇంతవరకు నడిచిన వ్యవహారాలు ముందు ముందు ఉండవని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ లోని బడా కాంట్రాక్టర్లు తో సహా చిన్న చిన్న కాంట్రాక్టర్ల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు రాజకీయ నాయకులను, అధికారులను అడ్డం పెట్టుకుని వివిధ కాంట్రాక్టర్లు పొందిన వారంతా ముందు ముందు ఎలా వ్యవహరించాలో తెలియక సతమతమవుతున్నట్లు సమాచారం.

భారీ నీటి పారుదల ప్రాజెక్టులతో సహా నగరాలు, పట్టణాలు, చివరకు గ్రామాలలో జరిగే వివిధ చిన్న చిన్న కాంట్రాక్టు పనులలో కూడా అంచనాలకు మించి కోట్‌ చేయడం, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఆనవాయితీగా మారింది.

నూతన ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో కాంట్రాక్టులకు సంబంధించి జ్యుడీషియల్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం తమను ఇబ్బందులపాలు చేస్తుందని కాంట్రాక్టర్లు వాపోతున్నట్లు సమాచారం. ఇది అమలు అయితే గతంలో తాము నిర్వహించినట్లుగా కాంట్రాక్టులు చేపట్టలేమని కొందరు కాంట్రాక్టర్లు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.

వాస్తవ రేట్లకే కాంట్రాక్టులు పొందాలని కాంట్రాక్టర్లు బెంబేలు పడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రజల నుంచి మాత్రం నూతన ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభినందనలు వస్తున్నాయంటున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వివిధ పనుల్లో జాప్యం జరగదని, ముఖ్యంగా ప్రజాధనం దుర్వినియోగం కాదన్నది ప్రజల ఉద్దేశంగా చెబుతున్నారు. నూతన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వామపక్ష పార్టీలతో సహా రాజకీయ విశ్లేషకులు కూడా అభినందించడం విశేషం.

First Published:  31 May 2019 4:38 AM IST
Next Story