నేడు జగన్... వారం రోజుల్లో కేబినెట్ టీం ప్రమాణ స్వీకారం?
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్ ప్రమాణస్వీకారం మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తమిళనాడు డిఎంకె నాయకుడు స్టాలిన్, బిహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో సహా పలువురు నేతలు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల ఇరవై మూడు నిమిషాలకు […]
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
జగన్ ప్రమాణస్వీకారం మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తమిళనాడు డిఎంకె నాయకుడు స్టాలిన్, బిహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో సహా పలువురు నేతలు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
గురువారం మధ్యాహ్నం 12 గంటల ఇరవై మూడు నిమిషాలకు గవర్నర్ నరసింహన్…. జగన్మోహన్ రెడ్డి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చే ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తరలి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎండ తగలకుండా మైదానంలో షామియాలను వేశారు. రెండు లక్షల మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.
ఇక కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ నెల 12న కానీ 13 వ తేదీన కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశం జరుగుతుంది. ఈ లోగా అంటే జూన్ 7 న కానీ 8వ తేదీన కానీ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల చేత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కేబినెట్ భేటీ అయిన తర్వాత కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇప్పటికే మంత్రుల పేషీలు సిద్ధం చేసే పనిలో పడ్డారు అధికారులు.
జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో 15 మంది మంత్రివర్గ సభ్యులు ఉంటారని పార్టీ నాయకులు చెబుతున్నారు. తన కేబినెట్లో జగన్మోహన్ రెడ్డి మహిళలతో సహా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన మంత్రివర్గంలో సీనియర్లకు పెద్దపీట వేస్తూనే ఒకరిద్దరు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు కూడా మంత్రివర్గంలో అవకాశం దొరక వచ్చునని చెబుతున్నారు.