Telugu Global
NEWS

నిర్లక్ష్యమే కారు కొంప ముంచిందా?

లోక్ సభ ఎన్నికలలో అనూహ్య ఫలితాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఆత్మ పరిశీలనలో పడిందని సమాచారం. పాతాళానికి పాతిపెట్టాలని తాము భావించిన కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలకు గెలుచుకుంది. అసలు సోదిలోకే ఉండదనుకున్న భారతీయ జనతా పార్టీ నాలుగు సీట్లలో విజయ కేతనం ఎగురవేసింది. ఈ రెండు పరిణామాలు టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదు. ఇది వారు కలలో కూడా ఊహించని పరిస్థితి. అయితే తాము ఆశించినట్లు 16 సీట్లు రాకపోవడానికి తమ […]

నిర్లక్ష్యమే కారు కొంప ముంచిందా?
X

లోక్ సభ ఎన్నికలలో అనూహ్య ఫలితాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఆత్మ పరిశీలనలో పడిందని సమాచారం. పాతాళానికి పాతిపెట్టాలని తాము భావించిన కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలకు గెలుచుకుంది. అసలు సోదిలోకే ఉండదనుకున్న భారతీయ జనతా పార్టీ నాలుగు సీట్లలో విజయ కేతనం ఎగురవేసింది.

ఈ రెండు పరిణామాలు టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదు. ఇది వారు కలలో కూడా ఊహించని పరిస్థితి. అయితే తాము ఆశించినట్లు 16 సీట్లు రాకపోవడానికి తమ ద్వితీయ స్థాయి నేతల అలసత్వమే కారణమని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతోంది.

పార్టీకి ట్రబుల్ షూటర్ గా ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు ను దూరం పెట్టడం, అసెంబ్లీ ఎన్నికలయ్యాక చాలా కాలం పాటు ఎవరికీ మంత్రి పదవులు ఇవ్వకుండా ఉండడం, కుటుంబ పాలన అని ముద్ర పడడం కూడా ప్రభావం చూపిందని అంటున్నారు.

పార్టీకి ఆయువు పట్టులాంటి ఉత్తర తెలంగాణలో మూడు స్థానాలు కోల్పోవడం ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు. తమకు తిరుగు లేదని…. ఎలాగైనా గెలిచి తీరతామని అధిష్టానం భావించడం, ఎమ్మెల్యేలు కూడా నామమాత్రంగా ప్రచారంలో పాల్గొనడంతో కార్యకర్తలు కూడా ఎంపీ ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు.

అదే సమయంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ తాము గెలుస్తామని భావించిన చోట చక్కగా పావులు కదిపాయి. చాపకింది నీరులా తమ విజయానికి బాటలు వేసుకున్నాయి. దీనికంతటికి కారణం తమ నాయకులేనని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వం చేసిన తప్పులు కూడా పరాజయానికి కారణమని చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఊపులో ఉన్న నేతలు తదనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాల పట్ల జనం ఎలా స్పందిస్తున్నారో అన్న విషయాన్నిమాత్రం గమనించలేకపోయారని కార్యకర్తలు మండి పడుతున్నారు. దీని ఫలితం ఎంతో కీలకమైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందని వాపోతున్నారు.

నిజామాబాద్ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంటులో కవిత విరామమెరుగక ప్రచారం చేసి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని, కవిత కోసం ఎమ్మెల్యేలు మాత్రం అలా ప్రచారం చేయలేకపోయారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ లో కూడా బీజేపీ అభ్యర్థి పట్ల సానుభూతి ఉందని వార్తలు వస్తున్నా, ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిందని తెలిసినా సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఓటమి పాలు కావలసి వచ్చిందని అంటున్నారు. ఆదిలాబాద్ స్థానాన్ని కూడా ఇలాంటి అలసత్వం కారణంగానే పోగొట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఒక సికింద్రాబాద్‌ విషయంలో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పట్ల స్థానికులకు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ అతనినే అభ్యర్ధిగా నిర్ణయించడం దెబ్బతీసిందంటున్నారు.

First Published:  26 May 2019 12:17 AM GMT
Next Story