Telugu Global
NEWS

ఎన్నికల ఎఫెక్ట్... తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు !

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అంటారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు మంత్రుల పదవులకు ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. తెలంగాణలో 16 స్థానాలను కైవసం చేసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి పదేపదే ప్రకటించింది. కారు… పదహారు… కేంద్రంలో సర్కారు… అంటూ కొత్త ఎన్నికల నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది. తీరా ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి 9 స్థానాలు మాత్రమే దక్కడం ఆ పార్టీకి పెద్ద షాక్. ఎవరూ ఊహించని విధంగా […]

ఎన్నికల ఎఫెక్ట్... తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు !
X

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అంటారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు మంత్రుల పదవులకు ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. తెలంగాణలో 16 స్థానాలను కైవసం చేసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి పదేపదే ప్రకటించింది. కారు… పదహారు… కేంద్రంలో సర్కారు… అంటూ కొత్త ఎన్నికల నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది.

తీరా ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి 9 స్థానాలు మాత్రమే దక్కడం ఆ పార్టీకి పెద్ద షాక్. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి నాలుగు స్థానాలు దక్కాయి.

కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర్రంలో లేకుండా చేయాలని ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆ పార్టీ కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఈ లోక్ సభ ఎన్నికలలో మూడు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కూడా జవసత్వాలు వచ్చినట్లుగా అయింది. ముఖ్యంగా ఈ ఎన్నికలలో మంత్రుల బంధువులు, వారసులు కూడా ఓటమి పాలు కావడం తెరాస అధిష్టానానికి మింగుడు పడడం లేదు.

తెలంగాణ లో వచ్చిన లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ సీనియర్ నాయకులతో సమీక్షించింనట్లు చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం వంటి నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సమావేశంలో కొందరు నాయకులు సీఎం దృష్టికి తీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు, చామకూర మల్లారెడ్డి అల్లుడు కూడా ఓటమి పాలు కావడంతో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విస్తరించాలని వ్యూహరచన చేస్తున్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నది కెసిఆర్ ఉద్దేశంగా చెబుతున్నారు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడంతో పాటు పార్టీని పటిష్టం చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

హరీష్ రావు వంటి కొందరు సీనియర్ నాయకులను మంత్రివర్గంలోకి తీసుకోవడంతోపాటు గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు పలు మార్పులు కూడా చేయాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడం కూడా లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించిందనేది పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయం. దీంతో ఒకరిద్దరు మహిళా శాసనసభ్యులకు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

First Published:  25 May 2019 2:55 AM IST
Next Story