Telugu Global
NEWS

చంద్రబాబు ఓడింది... ‘ఆనాడే’

ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ఓడిపోయారని అందరూ అనుకుంటున్న మాట. కానీ, రెండేళ్ల క్రితం నుంచే టీడీపీ సర్కారు పతనం ప్రారంభం అయిందనేది పరిశీలకులు చెబుతున్నమాట. దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని సాగించిన అరాచకాలు, చట్ట వ్యతిరేకంగా ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు అప్పటి ఎమ్మార్వో వనజాక్షి మీద ఆయన సాగించిన దాష్టీకం, ఎస్ఐ మీద చేయి చేసుకోవడం, వీటిని చంద్రబాబు సమర్థించిన తీరు  జనం మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయని చెబుతున్నారు. రాజధాని విజయవాడ నగరంలో కాల్ మనీ […]

చంద్రబాబు ఓడింది... ‘ఆనాడే’
X

ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ఓడిపోయారని అందరూ అనుకుంటున్న మాట. కానీ, రెండేళ్ల క్రితం నుంచే టీడీపీ సర్కారు పతనం ప్రారంభం అయిందనేది పరిశీలకులు చెబుతున్నమాట.

దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని సాగించిన అరాచకాలు, చట్ట వ్యతిరేకంగా ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు అప్పటి ఎమ్మార్వో వనజాక్షి మీద ఆయన సాగించిన దాష్టీకం, ఎస్ఐ మీద చేయి చేసుకోవడం, వీటిని చంద్రబాబు సమర్థించిన తీరు జనం మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయని చెబుతున్నారు.

రాజధాని విజయవాడ నగరంలో కాల్ మనీ దురాగతాలు, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులు అధికారుల మీద తెచ్చిన ఒత్తిడి కూడా ప్రజలను ఆలోచింపజేసిందని అంటున్నారు.

ఈ రెండు సంఘటనల తరువాత టీడీపీ సర్కారు మీద అసంతృప్తి చాప కింది నీరులా వ్యాపించిందని చెబుతున్నారు. దీనిని గుర్తించడంలోనూ పార్టీ అధినాయకత్వం విఫలమైందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

వీటికి తోడు జన్మభూమి కమిటీలు వ్యవహరించిన తీరు కూడా చాలా చోట్ల వివాదాస్పదంగా మారిందని, టీడీపీ జనానికి దూరం కావడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పట్టించుకోకపోవడం, ఈ దురాగతాలను చూడలేని పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు, అభిమానులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చినా ఆయన పెడ చెవిన పెట్టడంతో కూడా ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఒక్క చింతమనేనే కాదు. ఇంకొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల తీరు కూడా ఇలాగే కొనసాగిందని, ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు నేతల కారణంగా పార్టీకి చెందిన దిగువ స్థాయి నేతలు కన్నీళ్లు పెట్టిన సందర్భాలూ ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

ఇవన్నీ వెరసి టీడీపీని అథ: పాతాళానికి తోసేశాయని అంటున్నారు. పార్టీ వ్యవహారాలలో సీనియర్ నాయకులతో లోకేశ్ వ్యవహరించిన తీరుతోనూ కొందరు కార్యకర్తలు మనస్తాపానికి గురయ్యారని, వారంతా ఈసారి ఎన్నికలలో టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారని అంటున్నారు.

అమరావతి భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం, మాట వినని రైతుల పంటలను తగులబెట్టించడం, ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు మౌనంగా ఉండడం, పైగా దీనికంతటికీ విపక్షాలు కారణమంటూ దుమ్మెత్తిపోయండం వంటి కారణాలతో… సమయం చూసి జనం కీలెరిగి వాత పెట్టారని అంటున్నారు.

మొత్తానికి ‘అరయంగ కర్ణుడీల్గె ఆరుగురి చేతన్‘ అన్నట్టుగా చంద్రబాబును ఈసారి ఎన్నికలలో అనేక కష్టాలు చుట్టుముట్టి ఓటమి పాలు చేశాయనే అభిప్రాయాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  25 May 2019 4:41 AM IST
Next Story