Telugu Global
NEWS

జగన్.... నవీన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ !

ఆంధ్ర ప్రదేశ్ లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈనెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఒడిసా ముఖ్యమంత్రిగా ఐదవ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నవీన్ పట్నాయక్. ఈ రెండు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరవుతారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రిటన్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటించిన కల్వకుంట్ల […]

జగన్.... నవీన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ !
X

ఆంధ్ర ప్రదేశ్ లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈనెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఒడిసా ముఖ్యమంత్రిగా ఐదవ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నవీన్ పట్నాయక్.

ఈ రెండు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరవుతారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రిటన్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ద్వారా ఆ పని పూర్తి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా తాను హాజరై పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ప్రకటించేందుకు కేసీఆర్ వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంటోందని తెలిసిన కేసీఆర్ వెంటనే జగన్మోహన్ రెడ్డి కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

జగన్ ముఖ్యమంత్రి కావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహాయ సహకారాలు ఉంటాయని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని ఆకాంక్షించారు. వైయస్ జగన్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అపారమైన అభిమానం ఉందని, వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బహిరంగ పరిచేందుకు జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ తప్పక వెళ్తారని అటు పార్టీ వర్గాలు… ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా చెబుతున్నాయి.

భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామనుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆ ప్రయత్నంలో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను గతంలో కలుసుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వీరిద్దరి మధ్య రెండు మూడు సార్లు చర్చలు కూడా జరిగాయి.

అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో కేసీఆర్ కలలుగన్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఇప్పట్లో లేకపోవచ్చు. అయితే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఉన్న స్నేహం కారణంగా ఐదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న ఆయనకు స్వయంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు కేసీఆర్ ఒడిసా వెళ్తారని చెబుతున్నారు.

ఇటీవల ఒడిసాను కుదిపేసిన తుపాను కారణంగా అక్కడ కకావికలమైన విద్యుత్ వ్యవస్థను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు క్రమబద్ధీకరించారు. దీంతో నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య స్నేహం మరింత బలపడింది. ఈ కారణాల దృష్ట్యా ఒడిసా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్ వెళ్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  24 May 2019 2:44 AM IST
Next Story