Telugu Global
NEWS

ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలోనే అసాధారణ రికార్డు

వరుసగా ఏడో ప్రపంచకప్ కు బ్రెజిల్ వెటరన్ ఫార్మీగా రెడీ  పురుషులకు సైతం దక్కని రికార్డు బ్రెజిల్ మహిళకు సొంతం ఫ్రాన్స్ వేదికగా జూన్ 7 నుంచి జులై 7 వరకూ మహిళా ప్రపంచకప్ గ్లోబల్ గేమ్ ఫుట్ బాల్ లో ఓ అరుదైన ప్రపంచరికార్డుకు రంగం సిద్ధమయ్యింది. ఫ్రాన్స్ వేదికగా జూన్ 7 నుంచి నెలరోజులపాటు జరిగే 2019 మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో పాల‌్గొనటానికి బ్రెజిల్ మిడ్ ఫీల్డర్ ఫార్మీగా ఎంపిక కావడం ద్వారా […]

ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలోనే అసాధారణ రికార్డు
X
  • వరుసగా ఏడో ప్రపంచకప్ కు బ్రెజిల్ వెటరన్ ఫార్మీగా రెడీ
  • పురుషులకు సైతం దక్కని రికార్డు బ్రెజిల్ మహిళకు సొంతం
  • ఫ్రాన్స్ వేదికగా జూన్ 7 నుంచి జులై 7 వరకూ మహిళా ప్రపంచకప్

గ్లోబల్ గేమ్ ఫుట్ బాల్ లో ఓ అరుదైన ప్రపంచరికార్డుకు రంగం సిద్ధమయ్యింది. ఫ్రాన్స్ వేదికగా జూన్ 7 నుంచి నెలరోజులపాటు జరిగే 2019 మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో పాల‌్గొనటానికి బ్రెజిల్ మిడ్ ఫీల్డర్ ఫార్మీగా ఎంపిక కావడం ద్వారా చరిత్ర సృష్టించింది. వరుసగా ఏడు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న తొలి, ఏకైక ప్లేయర్ ఘనత సొంతం చేసుకోనుంది.

క్రీడలు ఏవైనా… క్రీడాకారులు ఎవరైనా… తమ జాతీయ జట్టులో సభ్యులుగా ప్రపంచకప్ లో పాల్గొనాలని కలలు కనడం సహజం.

ప్రపంచకప్ లో పాల్గొంటే చాలు… తమ జీవితం ధన్యమైనట్లే భావిస్తారు. అయితే రెండుకాదు… మూడు కాదు… ఏడుసార్లు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే అవకాశం వస్తే… అంతకు మించిన అదృష్టం మరొకటి లేదు.

అలాంటి అదృష్టమే బ్రెజిల్ కు చెందిన 41 ఏళ్ల మిడ్ ఫీల్డర్ ఫార్మీగా కు పట్టింది.

ఫ్రాన్స్ గడ్డపై ప్రపంచకప్

ఫుట్ బాల్ కు మరో పేరు బ్రెజిల్ ..మహిళా ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టులో వెటరన్ ఫార్మీగాకు సైతం చోటు దక్కింది. ఫార్మిగా గత ఆరు ప్రపంచకప్ టోర్నీలలో బ్రెజిల్ తరపున పాల్గొంటూ వస్తోంది. తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన ఫార్మీగా…. ఏడోసారి ప్రపంచకప్ కు ఎంపిక కావడం ద్వారా…. ప్రతిభకు వయసు ఏమాత్రం అవరోధం కాదని చాటి చెప్పింది.

జపాన్ కు చెందిన హొమారే సావాతో కలిసి ఆరు ప్రపంచకప్ టోర్నీల రికార్డు పంచుకొన్న ఫార్మీగా… ఏడోసారి ప్రపంచకప్ లో పాల్గొనటం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.

పురుషుల విభాగంలో ముగ్గురూ ముగ్గురే…

పురుషుల ప్రపంచకప్ చరిత్రలో ఐదు టోర్నీల్లో పాల్గొన్న రికార్డు ముగ్గురంటే ముగ్గురికి మాత్రమే ఉంది. జర్మన్ ఆల్ టైమ్ గ్రేట్ లోథార్ మతయాస్, మెక్సికో ఆటగాడు రాఫేల్ మార్కేజ్, ఆంటోనియో కార్బజాల్ మాత్రమే ఐదేసి ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న మొనగాళ్ళుగా ఉన్నారు.

మహిళల విభాగంలో బ్రెజిల్ కెప్టెన్ మార్తా ఇప్పటి వరకూ ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొంది. వరుసగా ఆరో ప్రపంచకప్ కు సైతం ఎంపికయ్యింది.

జూన్ 7 నుంచి జరిగే మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో బ్రెజిల్ 10వ ర్యాంక్ జట్టుగా బరిలోకి దిగుతోంది. జమైకా, ఆస్ట్రేలియా, ఇటలీ జట్లతో బ్రెజిల్ గ్రూప్ లీగ్ దశలో తలపడాల్సి ఉంది.

మహిళా ప్రపంచకప్ సాకర్ చరిత్రలో బ్రెజిల్ 2007లో మాత్రమే రన్నరప్ స్థానంలో నిలిచింది. 2019 ప్రపంచకప్ లో ఐదుసార్లు వరల్డ్ కప్ ప్లేయర్ మార్తా, ఏడో ప్రపంచకప్ కు సిద్ధమైన ఫార్మీగా ఏ రేంజ్ లో రాణిస్తారో మరి.

First Published:  20 May 2019 3:13 AM GMT
Next Story