యోగాతో పరుగుల యోగం
కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ విజయమంత్రం 39 ఏళ్ల వయసులో 5వ ప్రపంచకప్ కు గేల్ రెడీ ఐపీఎల్, ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో గేల్ జోరు ప్రపంచ క్రికెట్లో వీరబాదుడు ఓపెనర్ గా ఇప్పటికే రికార్డుల మోత మోగించిన కరీబియన్ డైనమైట్, వెటరన్ ఓపెనర్ క్రిస్ గేల్..2019 వన్డే ప్రపంచకప్ కు వినూత్న రీతిలో సిద్ధమవుతున్నాడు. 39 ఏళ్ల వయసులో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో బౌలర్ల ఊచకోతకు సై అంటున్నాడు. క్రిస్ గేల్…ఈ పేరు తలచుకోగానే క్రికెట్ […]
- కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ విజయమంత్రం
- 39 ఏళ్ల వయసులో 5వ ప్రపంచకప్ కు గేల్ రెడీ
- ఐపీఎల్, ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో గేల్ జోరు
ప్రపంచ క్రికెట్లో వీరబాదుడు ఓపెనర్ గా ఇప్పటికే రికార్డుల మోత మోగించిన కరీబియన్ డైనమైట్, వెటరన్ ఓపెనర్ క్రిస్ గేల్..2019 వన్డే ప్రపంచకప్ కు వినూత్న రీతిలో సిద్ధమవుతున్నాడు. 39 ఏళ్ల వయసులో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో బౌలర్ల ఊచకోతకు సై అంటున్నాడు.
క్రిస్ గేల్…ఈ పేరు తలచుకోగానే క్రికెట్ ఫీల్డ్ లో సునామీ వచ్చినట్లుగానే అనిపిస్తుంది. ఆరున్నర అడుగుల ఈ జెయింట్ ఓపెనర్ బ్యాట్ పట్టుకొని క్రీజులోకి వచ్చాడంటే చాలు…ప్రత్యర్థి కెప్టెన్ తో పాటు బౌలర్లకూ ముచ్చెమటలు పట్టక మానవు.
క్రికెట్ ఫార్మాట్ ఏదైనా సరే..గేల్ బ్యాట్ పట్టాడంటే చాలు…బౌలర్ల భరతం పట్టినట్లే. గ్రౌండ్ నలుమూలలకూ భారీ షాట్లు, సిక్సర్లు బాదడంలో గేల్ కు గేల్ మాత్రమే సాటి.
పాంచ్ పటాకాకు సిద్ధం…
తన కెరియర్ లో ఇపట్టికే నాలుగు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న అపారఅనుభవం ఉన్న గేల్..ఓ వైపు వివిధ దేశాల టీ-20 లీగ్ ల్లో పాల్గొంటూనే.. 39 ఏళ్ల వయసులో ఐదో ప్రపంచకప్ కు సిద్ధమవుతున్నాడు. శారీరక వ్యాయామం, జిమ్ లో కసరత్తుల కంటే…యోగాకే తాను ప్రాధాన్యమిస్తున్నానని… యోగా చేయడంతో శారీరక పటుత్వంతో పాటు …మానసికంగా ధృడంగా తయారుకాగలమని ధీమాగా చెబుతున్నాడు.
ఐపీఎల్ లో పరుగుల మోత….
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్ పోటీలలో కింగ్స్ పంజాబ్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగిన గేల్…490 పరుగులతో 40.83 సగటు నమోదు చేశాడు.
అంతేకాదు ..ప్రపంచకప్ కు సన్నాహకంగా ఇంగ్లండ్ తో ముగిసిన నాలుగుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో గేల్ పరుగుల వర్షం కురిపించాడు. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 424 పరుగులు సాధించాడు.
సిక్సర్ల బాదుడే బాదుడు…
ఐపీఎల్ లో 34 , ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో 39 సిక్సర్లు బాదిన ఘనత గేల్ కు ఉంది. తనకు తెలిసినంత వరకూ ప్రతిభ ఉంటే వయసుతో ఏమాత్రం సంబంధం లేదని…ఏదైనా సాధించాలని మనసులో అనుకొంటే దాని ప్రభావం శరీరం పైన ఉంటుందని… భావోద్వేగాలను అదుపులో ఉంచడానికి యోగాను మించిన సాధన మరొకటిలేదని గేల్ చెబుతున్నాడు.
ప్రపంచకప్ తర్వాతే రిటైర్మెంట్…
తన కెరియర్ లో ఇప్పటికే 10వేల 151 పరుగులు సాధించిన క్రిస్ గేల్…2019 ప్రపంచకప్ టోర్నీనే తన కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ అని ప్రకటించాడు.
ఈ టోర్నీ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకొంటానని…అయితే …అత్యుత్తమంగా రాణించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపాడు.
తన కెరియర్ లో 103 టెస్ట్ మ్యాచ్ లు, 289 వన్డే మ్యాచ్ లు ఆడిన గేల్…తాను కొత్తగా నిరూపించుకోవలసింది ఏదీ లేదని… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానుల కోసమే తన కెరియర్ కొనసాగిస్తున్నట్లు చెప్పాడు.
మే 30 నుంచి జూలై 14 వరకూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 వన్డే ప్రపంచకప్ లో క్రిస్ గేల్ ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో…వేచిచూడాల్సిందే.