ఐపీఎల్ లో భావోద్వేగాల వెల్లువ
నెగ్గితే ఆనందం…ఓడితే విషాదం వెక్కి వెక్కి ఏడ్చిన హైదరాబాద్ కోచ్ బెంగళూరు నిష్క్రమణతో విజయ్ మాల్యా సెటైర్లు ముంబై విజయంతో నీతా అంబానీ ఖుషీ భావోద్వేగాలకు అతీతంగా కూల్ కూల్ కెప్టెన్ ధోనీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత ఏడువారాలపాటు అలరించిన ఐపీఎల్ వివిధ జట్ల ఆటగాళ్లు, యజమానులు, అభిమానులకు మాత్రమే కాదు…మెంటార్లకు, శిక్షకులకు సైతం భావోద్వేగాలను మిగిల్చింది. ఎనిమిదిజట్లతో…56 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్, మూడుమ్యాచ్ ల క్వాలిఫైయర్స్, టైటిల్ సమరంతో సాగిన […]
- నెగ్గితే ఆనందం…ఓడితే విషాదం
- వెక్కి వెక్కి ఏడ్చిన హైదరాబాద్ కోచ్
- బెంగళూరు నిష్క్రమణతో విజయ్ మాల్యా సెటైర్లు
- ముంబై విజయంతో నీతా అంబానీ ఖుషీ
- భావోద్వేగాలకు అతీతంగా కూల్ కూల్ కెప్టెన్ ధోనీ
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత ఏడువారాలపాటు అలరించిన ఐపీఎల్ వివిధ జట్ల ఆటగాళ్లు, యజమానులు, అభిమానులకు మాత్రమే కాదు…మెంటార్లకు, శిక్షకులకు సైతం భావోద్వేగాలను మిగిల్చింది.
ఎనిమిదిజట్లతో…56 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్, మూడుమ్యాచ్ ల క్వాలిఫైయర్స్, టైటిల్ సమరంతో సాగిన ఈ టోర్నీలో… కొన్నిజట్లు అంచనాలకు మించి రాణిస్తే…మరికొన్ని జట్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమయ్యాయి.
హైదరాబాద్ కోచ్ విలాపం….
లీగ్ దశలో పడుతూ లేస్తూ వచ్చినా…14 రౌండ్లలో 6 విజయాలు మాత్రమే సాధించినా…అదృష్టవశాత్తు ఎలిమినేటర్ రౌండ్ చేరిన హైదరాబాద్ సన్ రైజర్స్…ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరాడి ఓడింది.
టోర్నీ నుంచి నిష్క్రమించడంతో హైదరాబాద్ చీఫ్ కోచ్ టామ్ మూడీ వెక్కి వెక్కి ఏడ్చారు. అందివచ్చిన అవకాశాన్ని తమజట్టు సద్వినియోగం చేసుకోలేకపోడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ క్రికెట్ వర్గాలలో టామ్ మూడీకి మంచి శిక్షకుడిగా పేరుంది. జట్టుతో మమేకమై సాగిపోయే కోచ్ గా గౌరవం ఉంది. అంతేకాదు.. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో దిట్టగా కూడా గుర్తింపు ఉంది.
ఎన్ని మంచిలక్షణాలున్నా..తమ జట్టు ఓటమిని మూడీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. గెలుపు, ఓటమి అటలో భాగమన్న వాస్తవాన్ని ఆయన మరచిపోయి…ఆటగాళ్లను మించి విషాదంలో మునిగిపోయారు.
సచిన్ నవ్వులే నువ్వులు…
మరోవైపు…మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి క్వాలిఫైయర్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసి…ఫైనల్స్ చేరడంతో… ముంబై మెంటార్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ నవ్వుల్లో మునిగిపోయారు. రోహిత్ సేన విజయాన్ని చూసి మురిసిపోయారు.
విజయ్ మాల్యా సెటైర్లు…
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ దారుణంగా విఫలమయ్యింది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు, 8 పరాజయాల రికార్డుతో..లీగ్ టేబుల్ ఆఖరి స్థానానికి పడిపోయింది. వరుసగా ఆరు పరాజయాలు చవిచూసిన ఏకైక జట్టుగా నిలిచింది.
దీంతో మాజీ ఓనర్ విజయ్ మాల్యా…ట్విట్టర్ ద్వారా తమ జట్టు ఆటతీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కొహ్లీ, డివిలియర్స్, స్టోయినిస్ లాంటి గొప్పగొప్ప ఆటగాళ్లున్నా…బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు …పేపర్ టైగర్స్ గా మిగిలిపోయిందంటూ విజయ్ మాల్యా అసంతృప్తి ప్రకటించారు. ఎనిమిదిజట్ల లీగ్ లో ఆఖరి స్థానంలో నిలిచిన తనజట్టును చూసి ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
గాల్లో తేలిపోతున్న నీతా అంబానీ హైదరాబాద్ వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైతో ముంబై మ్యాచ్ జరిగినంత సేపూ…ముంబై ఫ్రాంచైజీఓనర్లు నీతా అంబానీ, ఆమె కుమారుల ద్వయం తీవ్రభావోద్వేగాలకు గురయ్యారు. మ్యాచ్ ఆఖరి ఓవర్లో తమ జట్టు గెలవాలంటూ ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తూ.. ఉతంఠ మధ్య గడిపారు.
తమజట్టు సభ్యులంతా ఓ కుటుంబంగా కలసి గడిపే వాతావరణం కలిపించిన కారణంగానే తాము నాలుగో టైటిల్ సాధించామని విజయానంతరం నీతా చెప్పారు.
మరోవైపు…చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం…జయాపజయాలకు తాను అతీతమన్నట్లుగా..కూల్ కూల్ గా వ్యవహరించాడు.
మొత్తం మీద… ఫ్రాంచైజీ ఓనర్లు, శిక్షకులు మానవమాత్రులేనని…భావోద్వేగాలకు ఏమాత్రం అతీతులు కారని ప్రత్యేకంగా చెప్పాలా మరి.