Telugu Global
NEWS

ఎందుకీ మంత్రివర్గ సమావేశం బాబు ?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి సరిగ్గా వారం రోజుల సమయం ఉంది. ఈ నెల 23న వెలువడే ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తేలిపోతుంది. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పైకి చెబుతున్నా… లోలోన మాత్రం ఓటమి గుబులు ఆయనను వెంటాడుతోంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారుతుందని ఒకవైపు ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రివర్గ సమావేశాన్ని […]

ఎందుకీ మంత్రివర్గ సమావేశం బాబు ?
X

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి సరిగ్గా వారం రోజుల సమయం ఉంది. ఈ నెల 23న వెలువడే ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తేలిపోతుంది. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పైకి చెబుతున్నా… లోలోన మాత్రం ఓటమి గుబులు ఆయనను వెంటాడుతోంది అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారుతుందని ఒకవైపు ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రివర్గ సమావేశాన్ని మంగళవారం నాడు ఏర్పాటు చేస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పైనా… భారత ఎన్నికల కమిషన్ పైనా తనకు ఉన్న కోపాన్ని మంత్రివర్గ సమావేశం ఏర్పాటు ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వారం రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయంలో ఈ మంత్రివర్గ సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. భారత ఎన్నికల కమిషన్ కూడా మంత్రివర్గ సమావేశాన్ని కేవలం నాలుగు అంశాలకే పరిమితం చేయాలని హుకుం జారీ చేసింది.

ముఖ్యంగా ఎలాంటి చెల్లింపులకు…. బిల్లులకు…. ఆమోదముద్ర వేయరాదని కండిషన్ పెట్టింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఫొని తుపాను, కరువు పరిస్థితులతో పాటు మరో రెండు అంశాలకు మాత్రమే మంత్రివర్గ సమావేశం పరిమితం కావాలని ఆంక్ష విధించింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గానీ, పాత నిర్ణయాలను అమలు చేయడానికి గాని వీలు లేని మంత్రివర్గ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నాలుగు అంశాలపై తప్ప మరి ఏ అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించడానికి అవకాశం లేదు. ఈ నాలుగు అంశాలకు సంబంధించి ఆయా శాఖలకు చెందిన మంత్రులకు మాత్రమే విషయ పరిజ్ఞానం ఉంటుందని, మిగిలిన మంత్రులు ఈ సమావేశంలో ఉత్సవ విగ్రహాలుగా మిగులుతారని చెబుతున్నారు.

ఫలితాలు రావడానికి వారం రోజుల సమయం ఉన్నా…. ఈ కొద్ది సమయంలోనే రాష్ట్రాన్ని ఏం చేసేందుకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. “గడచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు ఆ వారం రోజుల్లో రాష్ట్రాన్ని ఏం మార్చేస్తారు. ఎలాంటి ఉపయోగం లేని మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఎవరి మెప్పు పొందాలని కుంటున్నారు” అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఒకరు వ్యాఖ్యానించారు.

ఈ మంత్రివర్గ సమావేశం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ ఉండదని, పంతాలకు పోయి ఉపయోగం లేని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు మానసిక స్థితి గందరగోళంగా ఉంది అనడానికి ఈ మంత్రివర్గ సమావేశం ఓ నిదర్శనం అని చెబుతున్నారు.

First Published:  14 May 2019 4:36 AM IST
Next Story