పవనాలు సారూ... భలేవారు మీరు!
రాజకీయ స్టార్ గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన పార్టీ విజయావకాశాల మీద లెక్కలు తీసుకుంటున్నారు. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కాబోయే సీఎం పవన్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్న వేళ సమీక్షా సమావేశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలోనూ హడావుడి చేసిన పవన్…. పోలింగ్ ముగిశాక ఎందుకో తెలియదుగానీ హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. ఈలోగా జనసేనలోని కొందరు కీలక నేతలు చల్లగా […]
రాజకీయ స్టార్ గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన పార్టీ విజయావకాశాల మీద లెక్కలు తీసుకుంటున్నారు.
పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కాబోయే సీఎం పవన్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్న వేళ సమీక్షా సమావేశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలోనూ హడావుడి చేసిన పవన్…. పోలింగ్ ముగిశాక ఎందుకో తెలియదుగానీ హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు.
ఈలోగా జనసేనలోని కొందరు కీలక నేతలు చల్లగా పార్టీ నుంచి జారుకున్నారు. దీంతోనే ఆ పార్టీ భవిష్యత్ ఏమిటో తేలిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి, రెండు సీట్లు గెలవగలిగినా ఒరిగే ప్రయోజనం ఏదీ ఉండకపోవచ్చని అంటున్నారు. కాకపోతే సమీక్షా సమావేశాలలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం, పతనం మీద కీలక చర్చ జరిగిందని వస్తున్న వార్తలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అయితే, కనీసం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పార్టీలాగానే నడిపించారని, అనుభవ లేమి, కొందరు భజనపరుల అత్యుత్సాహం, ఇంకొందరు నేతల తప్పటడుగుల కారణంగా ప్రజారాజ్యం దెబ్బతిన్నదని పరిశీలకుల అభిప్రాయం.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ ఈ అంశం మీద సమీక్ష చేసి, తన పార్టీలో అలా జరుగకుండా చూసుకుంటే బాగుండేదని అంటున్నారు. సరిగ్గా అన్న స్థాపించిన పార్టీలో ఏమి జరిగిందో, తమ్ముడి పార్టీలోనూ అదే జరిగిందని చెబుతున్నారు.
రాజకీయాలలో సంయమనం అవసరం. కానీ పవన్ పార్టీ స్థాపనలోనూ, ఎన్నికలలో పార్టీని నడిపించడంలోనూ ఎమోషనల్ ఫీలింగ్ నే నమ్ముకున్నారని, దీని పర్యవసానం ఏమిటో ఆయనకు త్వరగానే తెలిసి వస్తుందని చెబుతున్నారు.
మరోవైపు పవన్ ఎన్నికల ఫలితాలకు ముందే మరోసారి రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. త్వరలో స్థానిక సంస్ధల ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు అందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు.
దీనికి వారి నుంచి స్పందన ఉంటుందా అన్నది అనుమానమే. ఇప్పటికిప్పుడు ఇబ్బందులు ఏమీ ఉండకపోయినా, ఎన్నికల ఫలితాల తరువాత జనసేన భారీ కుదుపులకు లోనుకాక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పవన్ భవిష్యత్ లో పార్టీని ఎలా కాపాడుకుంటారో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందంటున్నారు పరిశీలకులు.