ఆయనొచ్చారు... మన పని "హరీ"... జనసైనికుల కంగారు?
జనసైనికులు కంగారు పడుతున్నారు. జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. జనసైనికులు కలవర పడుతున్నారు. ఎందుకంటారా..? ఆయన వచ్చారని. ఆయన రావడమే తన పాత కాకి లెక్కలను మరోసారి బహిర్గతం చేసి మళ్లీ అలనాటి సీన్ రివర్స్ చేస్తున్నారని వారి ఆందోళన. ఇంతకీ ఆయన ఎవరు… ఎక్కడికి వచ్చారు… జనసైనికులు ఆందోళన చెందేంతగా ఆయన చేసిన పని ఏమిటీ…? అనుకుంటున్నారా.. ఏం లేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన […]

జనసైనికులు కంగారు పడుతున్నారు. జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. జనసైనికులు కలవర పడుతున్నారు. ఎందుకంటారా..? ఆయన వచ్చారని. ఆయన రావడమే తన పాత కాకి లెక్కలను మరోసారి బహిర్గతం చేసి మళ్లీ అలనాటి సీన్ రివర్స్ చేస్తున్నారని వారి ఆందోళన.
ఇంతకీ ఆయన ఎవరు… ఎక్కడికి వచ్చారు… జనసైనికులు ఆందోళన చెందేంతగా ఆయన చేసిన పని ఏమిటీ…? అనుకుంటున్నారా.. ఏం లేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన పంచన చేరి పార్టీని “హరీ” మనిపించిన ఈ పాలకొల్లు నాయకుడు ఇన్నాళ్లు కిమ్మనకుండా ఇప్పుడు తగుదనమ్మా అంటూ రావడమే జన సైనికులకు ఆగ్రహం తీసుకువస్తోంది.
ప్రజారాజ్యం పార్టీ అత్యంత మెజార్టీతో అధికారంలోకి వస్తుందని చిరంజీవి అభిమానులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు కోటి ఆశలు పెట్టుకున్నారు. అలా జరుగుతుందని ఇతర పార్టీల వారు కూడా కాసింత కంగారు పడిన మాట వాస్తవమే. అయితే సీన్ రివర్స్ అయిపోయింది.
దీనికి కారణం సీనియర్లమంటూ పార్టీలోకి వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నాయకులే అంటున్నారు. వారు వచ్చీ రావడమే….. చిరంజీవికి అంత మెజార్టీ… ఇంత మెజార్టీ అని ప్రకటనలు చేయడం… కింగ్ మేకర్ వచ్చారని చెప్పడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చాయని జనసైనికుల అభిప్రాయం. అందుకే చిరంజీవి పార్టీ ఓటమి పాలైందని కూడా వారి నిశ్చితాభిప్రాయం.
ఇప్పుడు మళ్లీ సదరు నాయకుడు మళ్లీ రాజకీయ తెర మీదకు వచ్చారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా కిమ్మనకుండా ఇంటి పట్టున ఉన్న ఈ నాయకుడు చివరి క్షణంలో వచ్చి పార్టీ భవిష్యత్ ని “హరీ” మనిపించేస్తారా అని జనసైనికులు ఆందోళన చెందుతున్నారని సమాచారం.
రెండు రోజుల క్రితం ఈ పాలకొల్లు సారు…. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ అవుతారని, లేదూ అంటే కింగ్ మేకర్ ఖాయమని ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనే జనసైనికులకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. ఇంతకు ముందు ప్రజారాజ్యాన్ని కూడా ఇలాగే ఆకాశానికెత్తి ఆ తర్వాత పార్టీని “హరీ”మనిపించిన వాళ్లలో ఆయన ఒకరని వారంటున్నారు.
ఇదిగో ఇప్పుడు మళ్లీ జనసేనపై పడ్డారని, ఈయన ప్రకటనలతో మరోసారి మెగా కుటుంబానికి అన్యాయం జరుగుతుందా అని వారంతా ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.
గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లు పార్టీని హరీమనిపించేందుకు వచ్చే ఈ నాయకుడు ఎన్నికల ముందు రాకపోవడం తమకు ఎంతో మేలు చేసిందని, పోలింగ్ కు ముందే వచ్చి ఉంటే తమ పని నిజంగానే “హరీ”మంటుందని వారంటున్నారు.