Telugu Global
NEWS

కేటీఆర్ టార్గెట్ గా గ్లోబరీనా మీద దాడి?

తెలంగాణలో ఇంటర్ ఫలితాల గొడవను విపక్షాలు తారస్థాయికి తీసుకెళ్తున్నాయి. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలతో సర్కారుకు సెగ పుట్టిస్తున్నాయి. ఇన్నిఅవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ మీద దాడిని క్రమక్రమంగా తీవ్రతరం చేస్తున్నాయి. ప్రజా సంఘాలు కూడా వారికి తోడు కావడంతో పరిస్థితి మరింతగా వేడెక్కుతోంది. అయితే దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఉన్నారంటూ విపక్షాలు లక్ష్యంగా చేసుకునే వ్యూహం దాగి ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గ్లోబరీనాతో కేటీఆర్ కు సంబంధాలు […]

కేటీఆర్ టార్గెట్ గా గ్లోబరీనా మీద దాడి?
X

తెలంగాణలో ఇంటర్ ఫలితాల గొడవను విపక్షాలు తారస్థాయికి తీసుకెళ్తున్నాయి. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలతో సర్కారుకు సెగ పుట్టిస్తున్నాయి. ఇన్నిఅవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ మీద దాడిని క్రమక్రమంగా తీవ్రతరం చేస్తున్నాయి. ప్రజా సంఘాలు కూడా వారికి తోడు కావడంతో పరిస్థితి మరింతగా వేడెక్కుతోంది.

అయితే దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఉన్నారంటూ విపక్షాలు లక్ష్యంగా చేసుకునే వ్యూహం దాగి ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గ్లోబరీనాతో కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయని తీవ్ర విమర్శలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మాజీ ఎంపీ వి. హనుమంత రావు, రేవంత్ రెడ్డి ఇటీవల కేటీఆర్ మీద తీవ్రంగానే విరుచుకుపడ్డారు. వీహెచ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి “గ్లోబారీనాతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ పెద్దమ్మ తల్లి గుడిలో ప్రమాణం చేయాలని” కేటీఆర్ కు సవాల్ కూడా విసిరారు.

అంతేనా ఏకంగా ఆయన పెద్దమ్మ గుడి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఇవన్నీ కూడా తండ్రీకొడుకులను ఇబ్బంది పెట్టడానికేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆందోళనలను కూడా తీవ్రతరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే ఇంటర్ వ్యవహారంలో టీఆర్ఎస్ సర్కారును ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల మీద సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదు. అవకతవకలను సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు మాత్రం జారీ చేసి ఊరుకున్నారు. కేటీఆర్ మాత్రం గ్లోబారీనా సంస్థ పేరు కూడా తనకు తెలియదని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు, విపక్షాలు మాత్రం దీనిని నమ్మడం లేదు.

కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు గ్లోబరీనా నిర్వాకాల గురించి తాము ముందుగానే అప్రమత్తం చేశామని, ఆ కంపెనీని ఇంటర్ వ్యవహారాల నుంచి తప్పించపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించామని, అయినా ప్రభుత్వం పట్టించుకో లేదని పలువురు అధికారులు ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ సమస్య హైకోర్టుకు కూడా చేరింది. ఇక వీటిని తెలంగాణ సర్కారు ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాల్సిందే.

First Published:  30 April 2019 11:55 PM GMT
Next Story