Telugu Global
NEWS

తప్పు మీద తప్పు చేసిన గ్లోబరీనా.... త్రిసభ్య కమిటీ నివేదికలో వెల్లడి

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళాన్ని సృష్టించి అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైంది గ్లోబరీనా సంస్థేనని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. టెండర్ల ప్రక్రియ నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రతీ దశలోనూ గ్లోబరీనా తప్పులే కనపడుతున్నాయని ఆ కమిటీ చెప్పింది. అప్పట్లో అధికారులు గ్లోబరీనాకు కాంట్రాక్టు కట్టబెట్టడానికి అనేక నిబంధనలను తుంగలో తొక్కారని.. చివరకు ఆ తప్పే విద్యార్థుల ఆత్మహత్యల దాకా వెళ్లిందని తెలిపింది. సరైన సామర్థ్యం లేకపోయినా ఆ సంస్థకు ఇంటర్మీడియట్ […]

తప్పు మీద తప్పు చేసిన గ్లోబరీనా.... త్రిసభ్య కమిటీ నివేదికలో వెల్లడి
X

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళాన్ని సృష్టించి అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైంది గ్లోబరీనా సంస్థేనని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. టెండర్ల ప్రక్రియ నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రతీ దశలోనూ గ్లోబరీనా తప్పులే కనపడుతున్నాయని ఆ కమిటీ చెప్పింది. అప్పట్లో అధికారులు గ్లోబరీనాకు కాంట్రాక్టు కట్టబెట్టడానికి అనేక నిబంధనలను తుంగలో తొక్కారని.. చివరకు ఆ తప్పే విద్యార్థుల ఆత్మహత్యల దాకా వెళ్లిందని తెలిపింది.

సరైన సామర్థ్యం లేకపోయినా ఆ సంస్థకు ఇంటర్మీడియట్ ఫీజు వసూలు, హాల్ టికెట్ల జారీ, ఫలితాల ప్రకటన, మార్కుల షీట్ల జారీ వంటి ప్యాకేజీని కట్టబెట్టారు. గ్లోబరీనా సంస్థ సామర్థ్యమేమిటో ఫీజు చెల్లింపు సమయంలోనే తెలిసింది. చాలా కాలేజీల్లో పేమెంట్ గేట్‌వే ఓపెన్ కాలేదు. ఒక వేళ పేమెంట్ ఆప్షన్ కనిపించినా విద్యార్థుల వివరాలు కనిపించలేదు. ఇక కొన్ని చోట్ల విద్యార్థులు ఫీజు చెల్లించినా దాని వివరాలు కనిపించలేదు. కొంత మంది విద్యార్థులు అసలు ఫీజే చెల్లించనట్లు చూపించేది. దీంతో చాలా కళాశాలలు కొంత మంది విద్యార్థులకు రెండు సార్లు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది.

విద్యార్థులకు నష్టం జరుగుతుందని భయపడి కొన్ని కళాశాలలు బోర్డు వద్దకు పరుగులు పెట్టాయి. మాన్యువల్‌గా ఫీజులు చెల్లించడంతో పాటు వారి హాల్ టికెట్లు కూడా మాన్యువల్‌గానే తీసుకున్నారు. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమైతే.. 17వ తేదీ అర్థ రాత్రి వరకు హాల్ టికెట్లు జారీ చేశారంటే గ్లోబరీనా నిర్వాకం ఎలా ఉందో తెలిసిపోతోంది. అంతా ఆన్‌లైన్ చేశామని చెప్పినా 40 శాతం మంది విద్యార్థులకు మాన్యువల్‌గానే హాల్ టికెట్లు ఇచ్చారంటేనే గ్లోబరీనా పని తనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఫలితాల దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా తప్పుల తడకగా మారింది. హాల్ టికెట్లకు, ఓఎంఆర్ షీట్లకు లింకు తెలిపోయింది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల జవాబు పత్రాలతో పాటు ఓఎమ్మార్ షీట్లు జత కలవలేదు. దీంతో తర్వాత వచ్చిన ఓఎంఆర్ షీట్లను జవాబు పత్రాలతో కలిపేటప్పుడు తప్పులు జరిగాయి. ఒక విద్యార్థి జవాబు పత్రానికి మరో విద్యార్థి ఓఎంఆర్ షీటు కలిపారు. అసలు ఏ పేపర్ ఎవరిదో కూడా గుర్తించలేక పోయారు. దాంతో విద్యార్థుల మార్కులు అటువి ఇటు.. ఇటువి అటు పడ్డాయి. మొత్తంగా దాదాపు 15 లక్షలకు పైగా ఇలాంటి తప్పులు జరిగాయి. దీంతో మెరిట్ స్టుడెంట్స్ ఫెయిల్ కాగా, సాధారణ విద్యార్థులకు ఊహించనన్ని మార్కులు వచ్చాయి. ఈ తప్పులన్నీ సరిదిద్దాలంటే రీవాల్యుయేషన్ తప్ప మరో మార్గం లేదని త్రిసభ్య కమిటీ చెబుతోంది. కాని తెలంగాణ సర్కారు మాత్రం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ మాత్రమే చేస్తామని చెబుతోంది. దీనివల్ల విద్యార్థులకు సరైన న్యాయం జరిగే అవకాశం లేదు.

గ్లోబరీనా వల్ల లక్షన్నర జవాబు పత్రాల కోడింగ్, డీకోడింగ్‌లో తప్పులు జరిగాయని త్రిసభ్య కమిటీ తేల్చింది. అందువల్లే మార్కుల్లో భారీ తేడాలు ఉన్నట్లు చెప్పింది. అసలు టెండర్ల ప్రక్రియ సమయంలోనే గ్లోబరీనాకు ఈ పనులు అప్పజెప్పవద్దని అభ్యంతరాలు వచ్చాయి. ఆనాటి విద్యా శాఖా మంత్రి ఆధ్వర్యంలోని కమిటీ కూడా గ్లోబరీనాకు ఇవ్వొద్దనే సిఫార్సు చేసింది. అయినా బోర్డు అధికారులు కమిటీ నిర్ణయాన్ని పక్కన పెట్టి మరీ గ్లోబరీనాకు ఇచ్చేశారు. అంతే కాకుండా నిబంధనల ప్రకారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో గ్లోబరీనా ఏడాది పాటు పని చేయాలి. కాని గ్లోబరీనా మాత్రం అంతా తానై నడిపించింది. ఇందువల్లే ఇన్ని లక్షల తప్పులు దొర్లాయని త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది.

First Published:  29 April 2019 1:57 AM IST
Next Story