బాబుతో.... అవస్థల ఆంధ్రప్రదేశ్ !
ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారాన్ని నిలుపుకొనేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయనున్నాయా? కొత్తగా వెలుగు చూస్తున్ననిజాలు దానికి ఔననే సమాధానం చెబుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ లో ఏపీకి గుదిబండగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో ముఖ్యమైనది ఖజానా ఖాళీ కావడం. తాను ప్రకటించిన సంక్షేమ పథకాల తక్షణ అమలు కోసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించకుండా, ముఖ్యమైన బిల్లులను నిలిపివేసి కోశాగారంలోని చివరి పైసా […]
ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారాన్ని నిలుపుకొనేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయనున్నాయా? కొత్తగా వెలుగు చూస్తున్ననిజాలు దానికి ఔననే సమాధానం చెబుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ లో ఏపీకి గుదిబండగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇందులో ముఖ్యమైనది ఖజానా ఖాళీ కావడం. తాను ప్రకటించిన సంక్షేమ పథకాల తక్షణ అమలు కోసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించకుండా, ముఖ్యమైన బిల్లులను నిలిపివేసి కోశాగారంలోని చివరి పైసా వరకు ఓట్లను ఆకర్షించే పథకాలకోసం విడుదల చేశారని అంటున్నారు. దీంతో ఫలితాల తరువాత ఎవరు అధికార పగ్గాలు చేపట్టినా పాలనలో ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు.
ఉద్యోగుల జీతాల కోసం కూడా చేతులు చాపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఇది పాలకుల కంటే ఎక్కువగా రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనుభవమున్న నేతగా చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్రానికి ఈ పరిస్థితి తీసుకురావడం సరైంది కాదని అంటున్నారు.
రాజధాని భూముల సమస్య ఐదేళ్లు గడిచినా ఇంకా అలాగే ఉంది. అమరావతి నాసిరకం నిర్మాణాల మీద సమాధానం చెప్పే దిక్కు కూడా లేకుండా పోయిందని పలువురు మండి పడుతున్నారు. విభజన తరువాత ఆచితూచి అడుగులు వేయాల్సిన తరుణంలో ఇష్టానుసారంగా పనులు చేశారని, జవాబుదారీతనం లేకుండా పరిపాలన చేశారని చెబుతున్నారు.
తప్పులను ఎత్తి చూపిన ప్రతిపక్షానికి జవాబులు చెప్పాల్సింది పోయి ఎదురు దాడి చేస్తున్నారని అంటున్నారు. దీని ద్వారా ఏర్పడిన పర్యవసానాలకు మూల్యం ఎవరు చెల్లిస్తారని అడుగుతున్నారు.
ఒకవేళ చంద్రబాబే తిరిగి అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి గడ్డు పరిస్థితులు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం. రాజధాని అమరావతిలో ఉన్నవన్నీ తాత్కాలిక నిర్మాణాలే. శాశ్వత కట్టడాల దిశగా ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం శోచనీయమని పేర్కొంటున్నారు.
తమకు, తమ కుటుంబానికి, తమ పార్టీకి, తమ వారికి ఉపయోగపడే విధంగానే పాలన సాగించారని, రాష్ట్ర శ్రేయస్సును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఎప్పుడు కోలుకుంటుందో తెలియని స్థితి ఏర్పడిందని అంటున్నారు.