Telugu Global
NEWS

ఐటీ చూపు.... కారు వైపు ?

మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకుల వైపు తన చూపు సారించిన ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు ఆ చూపును తెలంగాణ రాజకీయ నాయకుల వైపు మార్చింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సహా…. మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు అందరిని తమ ఆస్తుల వివరాలు సమర్పించాలంటూ హుకుం జారీ చేసింది. వీరందరికీ 2014, 2018 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లు తమకు అందజేయాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది ఆదాయ పన్ను […]

ఐటీ చూపు.... కారు వైపు ?
X

మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకుల వైపు తన చూపు సారించిన ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు ఆ చూపును తెలంగాణ రాజకీయ నాయకుల వైపు మార్చింది.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సహా…. మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు అందరిని తమ ఆస్తుల వివరాలు సమర్పించాలంటూ హుకుం జారీ చేసింది. వీరందరికీ 2014, 2018 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లు తమకు అందజేయాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది ఆదాయ పన్ను శాఖ.

ఇంతే కాదు ఈ రెండు ఎన్నికల మధ్య సమయంలోను ప్రజాప్రతినిధులు సమర్సించిన ఐటీ రిటర్న్ లను కూడా తమకు అందజేయాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు, శాసనసభ్యులు కూడా ఉన్నారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికల సందర్భంగా ఈసీకి సమర్పించే అఫిడవిట్లలోను, ప్రజా ప్రతినిధులు ఆదాయ పన్ను శాఖకు ఇచ్చే ఐటీ రిటర్నులలోను ఏదైనా తేడా ఉందా అనే అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఎన్నికల సమయంలో కొందరు తమ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వకుండా కొన్ని వివరాలు మాత్రమే పొందుపరిచే అవకాశాలుంటాయి.

అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక పని అయిపోయిందనే భావనతో ఆదాయ పన్ను శాఖకు ఇచ్చే రిటర్నులలో మాత్రం లెక్కలు మారుస్తారు. ఇక్కడే ప్రజా ప్రతినిధులకు ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.

అఫిడవిట్లకు, ఐటీ శాఖకు సమర్పించిన రిటర్నులకు మధ్య భారీ తేడాలుంటే అప్పుడు పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. గతంతో పోలిస్తే తెలంగాణలో ప్రజాప్రతినిధుల ఆస్తులు భారీగానే పెరిగాయనే వాదన ఉంది. అందులోను అధికార పార్టీకి చెందిన వారి ఆస్తులు ఏడెనిమిది రెట్లు పెరిగి ఉండవచ్చు అంటున్నారు. దానిని ఐటీ రిటర్నులలో చూపకపోతే ఒక చిక్కు, ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో చూపకపోతే మరో చిక్కు మీద పడేలా ఉందని అంటున్నారు.

ఇక తెలంగాణ ప్రజాప్రతినిధులపై ఆదాయ పన్ను శాఖ కన్ను ఎందుకు పడిందని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మదనపడుతున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ తో ఎలాంటి వైరం లేదని చెబుతున్న బీజేపి కొత్తగా ఆదాయ శాఖ అస్త్రాన్ని ప్రయోగించడం వెనుక ఏ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయోనని కంగారు పడుతున్నారు. ఒకటి రెండు రోజులలో ఆదాయ శాఖ దాడులు కూడా చేస్తుందేమోననే భయం అధికార ప్రజాప్రతినిధులను వేధిస్తోంది. ఈ హఠత్ పరిణామం వెనుక రాజకీయ కోణం ఉందని ప్రజాప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  28 April 2019 2:36 AM IST
Next Story