Telugu Global
NEWS

ఆసియా బ్యాడ్మింటన్లో భారత్ ఫ్లాప్ షో

నెరవేరని 54 ఏళ్ల బంగారు కల క్వార్టర్ ఫైనల్లోనే సైనా, సింధు అవుట్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించాలన్న భారత షట్లర్ల 54 ఏళ్ల బంగారు కల మరోసారి కల్లగా మిగిలిపోయింది. చైనాలోని ఊహాన్ వేదికగా జరుగుతున్న 2019 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోనే సైనా నెహ్వాల్, పీవీ సింధుల పోటీ ముగియటంతోనే బంగారు ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. కనీసం కాంస్య పతకమైనా సాధించకుండానే భారత ప్లేయర్లు ఉత్తచేతులతో స్వదేశానికి తిరిగి […]

ఆసియా బ్యాడ్మింటన్లో భారత్ ఫ్లాప్ షో
X
  • నెరవేరని 54 ఏళ్ల బంగారు కల
  • క్వార్టర్ ఫైనల్లోనే సైనా, సింధు అవుట్

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించాలన్న భారత షట్లర్ల 54 ఏళ్ల బంగారు కల మరోసారి కల్లగా మిగిలిపోయింది.

చైనాలోని ఊహాన్ వేదికగా జరుగుతున్న 2019 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోనే సైనా నెహ్వాల్, పీవీ సింధుల పోటీ ముగియటంతోనే బంగారు ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి.

కనీసం కాంస్య పతకమైనా సాధించకుండానే భారత ప్లేయర్లు ఉత్తచేతులతో స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.

1965లో దినేశ్ ఖన్నాకు స్వర్ణం..

ఆసియా దేశాలలో అతిపెద్ద టోర్నీగా ఉన్న ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్…1965లో పురుషుల సింగిల్స్ లో బంగారు పతకం గెలుచుకొంది. దినేశ్ ఖన్నా భారత్ కు స్వర్ణం అందించారు.

ఆ తర్వాత నుంచి గత 54 సంవత్సరాలుగా భారత ప్లేయర్లు బంగారు పతకం సాధించడంలో విఫలమవుతూ వస్తున్నారు.

2010, 2016, 2018 టోర్నీలలో సైనా నెహ్వాల్ కాంస్య పతకాలు సాధిస్తే..2014 టోర్నీలోనే పీవీ సింధు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ 2018 టోర్నీలో బ్రాంజ్ మెడల్ తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

బంగారు ఆశలతో…..

చైనా వేదికగా జరుగుతున్న 2019 టోర్నీలో బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో భారత సూపర్ స్టార్ షటర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు బరిలోకి దిగారు. తొలి రౌండ్ నుంచి ప్రీ-క్వార్టర్ రౌండ్ వరకూ విజయాలు సాధిస్తూ వచ్చారు.

చివరకు…కీలక క్వార్టర్ ఫైనల్స్ రౌండ్లో పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. జపాన్ ప్లేయర్ అకానే యమగుచితో ముగిసిన హోరాహోరీ సమరంలో 13-21, 23- 21, 16-21తో ఓటమి పాలయ్యింది.

మరో క్వార్టర్స్ లో చైనా ప్లేయర్ సియా యాన్ యాన్ తో జరిగిన ఏకపక్ష పోరులో సింధు 19-21, 9-21 పాయింట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

పురుషుల సింగిల్స్ లో చైనా ప్లేయర్ , రెండో సీడ్ షియాక్యూ 10-21, 12-21తో సమీర్ వర్మను చిత్తు చేశాడు.

తగిన ప్రాక్టీస్ లేకే ఓటమి- గోపీచంద్…

భారత ప్లేయర్ల ఓటమికి తగిన ప్రాక్టీస్ లేకపోడమే కారణమని చీఫ్ కోచ్ గోపీచంద్ చెప్పారు. ఆసియా టోర్నీకి సిద్ధం కావటానికి కనీసం ఆరువారాల ప్రాక్టీస్ ఉండితీరాలని…అయితే…తమ షట్లర్లకు కేవలం రెండువారాల సమయం మాత్రమే చిక్కిందని వివరణ ఇచ్చారు. ఏమాత్రం విశ్రాంతి లేకుండా అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొంటూ రావటమే దీనికి కారణమంటూ తేల్చి చెప్పారు.

First Published:  28 April 2019 6:45 AM IST
Next Story