Telugu Global
National

కాంగ్రెస్ కలలు... నిజమవుతాయా ?

దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ఆసక్తికర దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 307 స్థానాల్లో పోలింగ్ పూర్తి అయ్యింది. ఇంకా దాదాపు 240 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పోలింగ్ పూర్తి అయిన వాటిలో బీజేపీ పరిస్థితి నిరాశాజనకంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇది కాంగ్రెస్ లో హుషారు నింపుతోంది. యూపీలో తాము అధిక సీట్లు గెలుచుకుంటామని ఆ పార్టీ నమ్ముతోంది. యోగి పాలన మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇది తమకు లాభం చేకూరుస్తుందని భావిస్తోంది. కాంగ్రెస్ […]

కాంగ్రెస్ కలలు... నిజమవుతాయా ?
X

దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ఆసక్తికర దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 307 స్థానాల్లో పోలింగ్ పూర్తి అయ్యింది. ఇంకా దాదాపు 240 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పోలింగ్ పూర్తి అయిన వాటిలో బీజేపీ పరిస్థితి నిరాశాజనకంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఇది కాంగ్రెస్ లో హుషారు నింపుతోంది. యూపీలో తాము అధిక సీట్లు గెలుచుకుంటామని ఆ పార్టీ నమ్ముతోంది. యోగి పాలన మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇది తమకు లాభం చేకూరుస్తుందని భావిస్తోంది.

కాంగ్రెస్ ప్రచార సభలకు జనం భారీగా తరలిరావడం కూడా వారిలో ఆశలు రేకెత్తిస్తోంది. కానీ, ప్రియాంక విషయంలోనే ఆ పార్టీ తప్పటడుగు వేసినట్టు కనిపిస్తోంది. మోడీపై పోటీకి తాను సై అని, పార్టీ ఆదేశిస్తే వారణాసి నుంచి తాను రంగంలోకి దిగుతానని ప్రియాంక నాలుగైదు సార్లు ప్రకటించారు.

దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తీరా సమయానికి ప్రియాంక పోటీ చేయడం లేదనే ప్రకటన పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో నిరాశ నింపింది. ప్రియాంక రంగంలో ఉంటే తాము మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించ గలుగుతామనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది.

ఇటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ లోనూ తాము ప్రభావం చూపుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మహారాష్ట్ర, అస్సాం, ఢిల్లీలోనూ ఎక్కువ సీట్లే వస్తాయని అంటున్నారు. తమ అధినేత ప్రకటించిన న్యాయ్ పథకం తమకు మేలు చేకూరుస్తుందని అంటున్నారు.

మొత్తానికి భారతీయ జనతా పార్టీ కంటే తాము అధిక సీట్లు సాధించి లోక్ సభలో తామే అతి పెద్ద పార్టీగా అవతరిస్తామని, కలిసి వచ్చే పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని వారు విశ్వసిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి వారి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పట్టు నిలుపుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారణాసిలో తన ప్రత్యర్థుల కళ్లు చెదిరే విధంగా భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఆ తరువాత స్ఫూర్తిదాయక ప్రసంగమే చేశారు. యూపీలో కమలనాథుల పట్ల ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు యత్నించారు. కానీ, కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్న వేళ మోడీ మాటలను అక్కడి జనం ఏ మేరకు విశ్వసిస్తారో చూడాలి.

First Published:  27 April 2019 4:28 AM IST
Next Story