ఏపీ ప్రభుత్వ ఖర్చు లపై ఈసీ ఆరా...!
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో చేసిన ఖర్చులపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఏ పథకాలకు ఎంత ఖర్చు పెట్టారు వంటి వివరాలను బయటకు తీయాల్సిందిగా ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన గడచిన రెండు రోజులుగా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఒకసారి […]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో చేసిన ఖర్చులపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఏ పథకాలకు ఎంత ఖర్చు పెట్టారు వంటి వివరాలను బయటకు తీయాల్సిందిగా ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆదేశించినట్లు చెబుతున్నారు.
ఈ మేరకు ఆయన గడచిన రెండు రోజులుగా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇక ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చులు చేసే అధికారం ఉండదని అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఆ నియమాన్ని, నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారీతిగా ఖర్చు చేసింది అనే విమర్శలు వస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న వారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే వ్యవహరించాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వివిధ పద్దుల కింద కేంద్ర ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వీటిని ఆయా పద్దుల కోసం ఖర్చు చేయకుండా జనాకర్షక పథకాలను ఖర్చు పెట్టారని తేలినట్లుగా చెబుతున్నారు.
ఎన్నికలకు వారం రోజుల ముందు మహిళలకు పసుపు – కుంకుమ, రైతులకు అన్నదాత పథకం కింద ఈ సొమ్మును ఖర్చు చేసినట్లుగా అధికారులు లెక్కలు చూపించినట్లు సమాచారం.
దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఏ పద్దుల కోసం కేంద్రం నిధులు విడుదల చేసిందో… ఆ పద్దుల కోసమే ఖర్చు చేయాలి తప్ప వాటిని మళ్లించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధికారులపై మండిపడినట్లు సమాచారం.
దీనిపై ఆర్థిక శాఖ అధికారులు సమాధానం చెప్పలేక నోరెళ్ళబెట్టినట్లుగా చెబుతున్నారు. ఫలితాలు వెలువడేలోగా ఎన్నికల సంఘం ప్రభుత్వం చేసిన ఖర్చులు, వాటి వివరాలపై సమాచారాన్ని సేకరించే పనిలో పడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.