మళ్ళీ తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల టూరు చేపట్టనున్నారట. సీఎం హోదాలో కాదులేండి, ఆ హోదా ఉన్నప్పటికీ తెరాస అధినేత హోదాలో కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారట. అక్కడ ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీల అధినేతలను కలిసి…. మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ కు ఊపు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ పర్యటనలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఇలాగే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలతో వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు కర్ణాటక, తమిళనాడు, […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల టూరు చేపట్టనున్నారట. సీఎం హోదాలో కాదులేండి, ఆ హోదా ఉన్నప్పటికీ తెరాస అధినేత హోదాలో కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారట. అక్కడ ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీల అధినేతలను కలిసి…. మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ కు ఊపు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ పర్యటనలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది.
కొన్ని నెలల క్రితం ఇలాగే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలతో వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలకు వెళ్లారు కేసీఆర్. కర్ణాటకలో జేడీఎస్, తమిళనాట డీఎంకే, ఒడిశాలో బీజేడీ నేతలను కేసీఆర్ కలిశారు. అలాగే యూపీ, బెంగాల్ లకు కూడా వెళ్లి వచ్చారు.
అయితే అప్పట్లో కేసీఆర్ చేసిన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించలేదు. కేసీఆర్ వెళ్లినప్పుడు పాజిటివ్ గానే మాట్లాడిన వివిధ పార్టీల నాయకులు ఆ తర్వాత ఆయనను పట్టించుకోలేదు. జేడీఎస్ అయితే ఫెడరల్ ఫ్రంట్ కు ఓకే అని చెప్పి, ఆ తర్వాత తమ అవసరం మేరకు కాంగ్రెస్ తో కలిసింది.
ఇక మిగతా పార్టీల వాళ్లు కూడా కేసీఆర్ ప్రతిపాదిత ఫ్రంట్ పట్ల అంత ఉత్సాహాన్ని చూపలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన అప్పుడు ఒట్టి గ్యాస్ గా మిగిలిపోయింది. అయితే ఆ విషయంలో వెనక్కు తగ్గేది లేదంటున్నారట తెరాస అధినేత.
అందుకే ఇప్పుడు మళ్లీ ఆయన వివిధ పార్టీల నేతలను ఈ ప్రతిపాదనలతో కలవబోతున్నట్టుగా సమాచారం!
కేంద్రంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ లెక్క. అందుకోసం మళ్లీ వివిధ పార్టీల నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతారట.
మరి ఈ సారి అయినా కేసీఆర్ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయా అనేది సందేహమే. కొంతలో కొంత ఊరట…. ఇటీవల మమతా బెనర్జీ స్పందిస్తూ కేంద్రంలో ఫెడరల్ ఫ్రంటే ప్రధాని గా ఎవరు కూర్చోవాలో డిసైడ్ చేస్తుందని అనడం. దీంతో కేసీఆర్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా ఉంది. వెంటనే రాష్ట్రాల పర్యటనలు అంటున్నారు. మరి ఈ పర్యటనలతో కేసీఆర్ చక్రం తిరగడం ఆరంభం అవుతుందేమో చూడాలి!