Telugu Global
NEWS

అంతా మీ వల్లే జరిగింది.... ఓటమికి మీరే కారణం : తమ్ముళ్లపై బాబు ఆగ్రహం..!

“అంతా మీరే చేశారు. ఎన్నికలలో పార్టీ ఓడిపోతే దానికి మీరే కారణం. మీ మితిమీరిన అవినీతి కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతోంది” ఇదీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆగ్రహం. పార్టీ విజయావకాశాలపై అమరావతిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అభ్యర్థులు, సీనియర్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు శాసనసభ ఎన్నికలలో […]

అంతా మీ వల్లే జరిగింది.... ఓటమికి మీరే కారణం : తమ్ముళ్లపై బాబు ఆగ్రహం..!
X

“అంతా మీరే చేశారు. ఎన్నికలలో పార్టీ ఓడిపోతే దానికి మీరే కారణం. మీ మితిమీరిన అవినీతి కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతోంది” ఇదీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆగ్రహం.

పార్టీ విజయావకాశాలపై అమరావతిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అభ్యర్థులు, సీనియర్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు శాసనసభ ఎన్నికలలో పరాజయం పాలవుతామని చంద్రబాబు నాయుడు అంచనా వేసినట్లుగా చెబుతున్నారు.

దీంతో తన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ఆపుకోలేని చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులు, సీనియర్ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ విజయం కోసం తాను అన్ని రకాలుగానూ కష్టపడ్డానని, మహిళలను, రైతులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పథకాలు కూడా తీసుకు వచ్చానని, అయినా తమ్ముళ్ల నిర్వాకం కారణంగా ఓటమి పాలయ్యే దశకు పార్టీ చేరుకుందని మండిపడినట్లు చెబుతున్నారు.

గడచిన ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ అవినీతికి పాల్పడటం, ఎన్నికలను చిన్న చూపు చూడడం వంటి కారణాలవల్ల ఓటమి పాలవుతున్నామని చంద్రబాబు నాయుడు అన్నట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాలలో అందరినీ నిలబెట్టినా తానే పోటీలో ఉన్నానని భావించాల్సిందంటూ ఓటర్లను అభ్యర్ధించేలా పరిస్థితి రావడం పార్టీ నాయకుల నిర్వాకానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ప్రతిపక్ష వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపట్టిందని, తిరిగి అధికారంలోకి వస్తే కొన్ని పథకాలను నిలిపివేస్తామని ప్రచారం జరగడంతో ఓటర్లు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితి లేదని కొందరు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం.

మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా కొత్త ఓటర్లపై ఎక్కువగా పడిందని, యువతీ యువకులు జనసేనకు ఆకర్షితులయ్యారని తెలుగుదేశం అభ్యర్థులు సమావేశంలో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. “ మీ చేతగాని తనాన్ని ఎదుటి పార్టీల గొప్పతనంగా చెప్పకండి. నేను ఎంత చేసినా మీ వల్లే ఓటమి పాలవడం ఖాయంగా కనిపిస్తోంది” అని చంద్రబాబు నాయుడు సమావేశంలో మండిపడినట్లు సమాచారం.

సమావేశంలో ఒకరిద్దరు నాయకులు పలు అంశాలపై ప్రస్తావించడానికి ప్రయత్నిస్తే “ఇక చాలు” అంటూ చంద్రబాబు నాయుడు వారిని వారించినట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  23 April 2019 2:46 AM IST
Next Story