Telugu Global
NEWS

ఇదా కేసీఆర్ ఎత్తుగడ...!

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో వరుసగా చేర్చుకోవడం వెనుక సుదీర్ఘ ప్రణాళికే ఉందని అంటున్నారు ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు. యువ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుకు భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అందులో ఈ చేరికలు కూడా కొన్ని ప్రయత్నాలని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గులాబీ గూటికి లాగేస్తే, ఈ ఐదేళ్లూ సజావుగా సాగడమే కాకుండా, […]

ఇదా కేసీఆర్ ఎత్తుగడ...!
X

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో వరుసగా చేర్చుకోవడం వెనుక సుదీర్ఘ ప్రణాళికే ఉందని అంటున్నారు ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు.

యువ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుకు భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అందులో ఈ చేరికలు కూడా కొన్ని ప్రయత్నాలని చెబుతున్నారు.

నియోజకవర్గాల వారీగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గులాబీ గూటికి లాగేస్తే, ఈ ఐదేళ్లూ సజావుగా సాగడమే కాకుండా, 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్షానికి అభ్యర్ధులే దొరకకుండా చేసే వ్యూహం ఇందులో ఇమిడి ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే అంతో ఇంతో కేడర్ కూడా వారిని అనుసరిస్తుంది.

ఈ క్రమంలో అక్కడ కొత్త నాయకత్వం ఎదగడం కష్టమైన పనే అవుతుందని గులాబీ బాస్ ఎత్తుగడగా చెబుతున్నారు. గులాబీ అధినేత సరిగ్గా ఈ పాయింటునే పట్టుకుని ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం సహజం. దానిని ఇదే అంశంతో ఎదుర్కోవచ్ఛనేది కేసీఆర్ వ్యూహమని చెబుతున్నారు.

అసలే కేసీఆర్ రాష్ట్రంలో పాలనాపరంగా భారీ సంస్కరణలు ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. అందులో రెవెన్యూ శాఖ రద్దు అనేది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఈ శాఖను రద్దు చేయడం అంత సులభం కాదనే విషయం ముఖ్యమంత్రికి స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన బహుముఖ వ్యూహాలను రచిస్తున్నారంటున్నారు.

ప్రభుత్వంలోని ఒక ముఖ్య శాఖను రద్దు చేస్తే ఆ శాఖకు చెందిన ఉద్యోగులు బజారుకెక్కి రచ్ఛ చేయకుండా ఉండరు. వారికి ప్రతిపక్షాలు వంత పాడకుండా ఉండవు. అసలు విపక్షాలకు బలం లేకుండా చేయడమే ఈ చేరికల వెనుక ఉన్న వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే టీడీపీ దాదాపుగా కనుమరుగు అయిపోయింది. బీజేపీ ఉనికిని చాటుకోవడానికే తంటాలు పడుతోంది. చూడబోతే అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ తరువాత మజ్లిసే అతి పెద్ద పక్షంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. అదెలాగూ మిత్ర పక్షమే కాబట్టి సమస్యే లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్ ఒక్కటే కాబట్టి దానిని బలహీన పరిస్తే టీఆర్ఎస్ కు భవిష్యత్తులో తిరుగే ఉండదని గులాబీ దళపతి భావిస్తున్నట్టు సమాచారం.

First Published:  22 April 2019 2:05 AM IST
Next Story