Telugu Global
Cinema & Entertainment

"జెర్సీ" సినిమా రివ్యూ

రివ్యూ: జెర్సీ రేటింగ్‌:  3.5/5 తారాగణం: నాని,శ్రద్ధ శ్రీనాధ్ తదితరులు సంగీతం: అనిరుధ్ రవిచందర్ నిర్మాత:  సూర్యదేవర నాగ వంశీ దర్శకత్వం:  గౌతమ్ తిన్ననూరి ‘దేవదాసు’ సినిమాలో డాక్టర్ గా కనిపించిన నాచురల్ స్టార్ నాని ఈసారి ‘జెర్సీ’ సినిమాలో క్రికెటర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈమెకు ఇదే మొట్టమొదటి చిత్రం. ఈ […]

జెర్సీ సినిమా రివ్యూ
X

రివ్యూ: జెర్సీ
రేటింగ్‌: 3.5/5
తారాగణం: నాని,శ్రద్ధ శ్రీనాధ్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

‘దేవదాసు’ సినిమాలో డాక్టర్ గా కనిపించిన నాచురల్ స్టార్ నాని ఈసారి ‘జెర్సీ’ సినిమాలో క్రికెటర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈమెకు ఇదే మొట్టమొదటి చిత్రం.

ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాని. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. నాని ముందు రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 19, 2019 న విడుదలైంది.

కథ:

అర్జున్ (నాని) ఒక మాజీ క్రికెటర్. ఇండియా టీం కోసం రెండు సార్లు ప్రయత్నించి విఫలమవుతాడు. వచ్చే ఏడాది కూడా ఎంపిక అవ్వడేమో అన్న భయంతో క్రికెట్ ను వదిలేస్తాడు. ఫుడ్ కార్పొరేషన్ లో అర్జున్ ఉద్యోగం కూడా పోతుంది. ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా అర్జున్ జీవితం కష్టాల్లోకి వెళ్లి పోతుంది.

అలాంటి సమయంలో మళ్లీ క్రికెట్ వైపు మొగ్గు చూపుతాడు అర్జున్. అసలు క్రికెట్ ను ఎందుకు వదులుకున్నాడు? మళ్లీ క్రికెట్ పై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడు? ఈసారి అర్జున్ కి క్రికెటర్ గా విజయం లభిస్తుందా? చివరికి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటులు:

నాని అద్భుతమైన నటన ఈ సినిమాకు హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం ప్రేక్షకులు నానికంటే అర్జున్ అనే పాత్రను మాత్రమే చూస్తారు. తన పాత్రలో అంత బాగా ఒదిగిపోయాడు నాని.

క్రికెట్ సన్నివేశాల్లోనే కాక ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా నాని నటన ఈ సినిమాకు వెన్నెముక మారింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో నాని నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

శ్రద్ధ శ్రీనాధ్ చాలా బాగా నటించింది. టీనేజ్ పాత్రలోనే కాక భార్య పాత్రలో కూడా నాని తో పోటీగా చాలా బాగా నటించింది.

సత్యరాజ్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. సత్యరాజ్ నటన ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. సంపత్ రాజ్ కూడా చాలా బాగా నటించారు. తమ పరిధి మేరకు ప్రవీణ్ కూడా బాగానే నటించారు. మిగతా నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:

గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కోసం ఒక మంచి కథను రాసుకున్నారు. మిగతా అన్ని సినిమాలు లాగా కమర్షియల్ ఎలిమెంట్ లపై దృష్టి పెట్టకుండా ఈ సినిమాలో తన కథను చాలా బాగా నెరేట్ చేశారు గౌతమ్.

సెకండ్ హాఫ్ లో కొంచెం సాగతీత ఎక్కువ అనిపించినప్పటికీ గౌతమ్ కథను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది. సినిమాకు సూర్యదేవర నాగ వంశీ అందించిన నిర్మాణ విలువలు చాలా ప్లస్ అయ్యాయి. క్వాలిటీ పరంగా ఏ మాత్రం రాజీపడకుండా ఈ సినిమాకు మంచి విలువలను అందించారు.

అనిరుద్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు హైలైట్. పాటలు మాత్రమే కాక అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను కథతో మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సను వర్గీస్ అందించిన విజువల్స్ ఈ సినిమాకి మరింత అందాన్ని చేకూర్చాయి. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

తీర్పు:

పేరుకు తగ్గట్టుగానే స్పోర్ట్స్ డ్రామా గా ఈ చిత్రం పూర్తి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది.

మొదటి హాఫ్ మొత్తం కొంచెం ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ లతో నిండి ఉంటుంది. నాని, శ్రద్ధ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. మొదటి హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ లో ఎమోషనల్ డోస్ బాగా పెరుగుతుందని చెప్పాలి.

ముఖ్యంగా నాని శ్రద్ధ ల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మనసుకి హత్తుకొనే విధంగా ఉన్నప్పటికీ కొంచం సాగదీసినట్టు కూడా ఉంటాయి.

అయినప్పటికీ దర్శకుడు ఏమాత్రం బోర్ కొట్టించకుండా ఈ సినిమాను బాగా నెరేట్ చేశాడు. ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా బాగా కుదిరింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి క్లైమాక్స్ వేరే సినిమాలలో చూడలేదని చెప్పచ్చు. ఆఖరిగా ‘జెర్సీ’ ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా.

ఇది దర్శకుడి సినిమా. దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి తన ప్రతిభను అత్యద్భుతంగా ప్రదర్శించాడు. అర్జున్ పాత్రను తీర్చిదిద్దడంలో దర్శకుడి ప్రతిభ వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో ఇంత మంచి సినిమా రాలేదు.

First Published:  19 April 2019 12:52 PM IST
Next Story