Telugu Global
NEWS

కారులో గ్రూపుల గోల..!

తెలంగాణ రాష్ట్ర సమితిలో గ్రూపు తగాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధీనంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉండేది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కల్వకుంట్ల తారక రామారావును నియమించడంతో ఇక పెత్తనమంతా ఆయన ఆధీనంలోకి మారింది. యువకుడు, పెద్దగా అనుభవం లేకపోవడంతో పార్టీలో ఉన్న సీనియర్లతో ఎలా వ్యవహరించాలో తెలియక తారక రామారావు ఇబ్బందులు పడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అదనుగా పార్టీలో కొందరు గ్రూపు రాజకీయాలకు తెరతీస్తున్నారని […]

కారులో గ్రూపుల గోల..!
X

తెలంగాణ రాష్ట్ర సమితిలో గ్రూపు తగాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధీనంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉండేది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కల్వకుంట్ల తారక రామారావును నియమించడంతో ఇక పెత్తనమంతా ఆయన ఆధీనంలోకి మారింది.

యువకుడు, పెద్దగా అనుభవం లేకపోవడంతో పార్టీలో ఉన్న సీనియర్లతో ఎలా వ్యవహరించాలో తెలియక తారక రామారావు ఇబ్బందులు పడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అదనుగా పార్టీలో కొందరు గ్రూపు రాజకీయాలకు తెరతీస్తున్నారని అంటున్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి లోకి ఇతర పార్టీలకు చెందిన నాయకులు వచ్చి చేరడం ప్రారంభమైంది. అప్పటికే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు కొందరు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండడంతో ఆ పార్టీల నుంచి వచ్చిన నాయకులు వీరితో జత కలిసి గ్రూపులు కడుతున్నారని అంటున్నారు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం గ్రూపు, కాంగ్రెస్ గ్రూపు, టిఆర్ఎస్ గ్రూపు, సీనియర్ల గ్రూపు అంటూ పార్టీలో కొందరు గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్నారు.

మంత్రివర్గ విస్తరణ సమయంలో పార్టీలో సీనియర్లను పక్కన పెట్టడంతో వారి అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. వారంతా కలిసి ఓ గ్రూపుగా ఏర్పడినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యులు, సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ పదవులు, ఇతర పదవులలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారనే అనుమానం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారికి కలుగుతోందంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు సీనియర్లు తమ వర్గం వారిని ఏర్పాటు చేసుకొని అంతర్గత రాజకీయాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అందరూ తనకంటే సీనియర్లు కావడంతో వారిని తన వైపు తిప్పుకోవడం ఎలాగో తెలియక పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు సతమతమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ గ్రూపు తగాదాల గురించి పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలిసినా పైకి ఆయన ఏమి మాట్లాడడం లేదని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  16 April 2019 9:22 PM GMT
Next Story