Telugu Global
NEWS

బాబూ... మా ప్రచారానికి రావద్దు బాబు..!

నారా చంద్రబాబు నాయుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నిటితో సంబంధాలు కలిగి ఉన్నాను అని చెబుతున్న నాయకుడు. తన గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయని ప్రచారం చేసిన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ, ఆప్ నాయకుడు కేజ్రీవాల్, కాశ్మీర్ ప్రాంతీయ పార్టీ నాయకుడు అబ్దుల్ గఫార్ వంటివారు చంద్రబాబు నాయుడు గెలుపు కోసం […]

బాబూ... మా ప్రచారానికి రావద్దు బాబు..!
X

నారా చంద్రబాబు నాయుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నిటితో సంబంధాలు కలిగి ఉన్నాను అని చెబుతున్న నాయకుడు. తన గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయని ప్రచారం చేసిన నాయకుడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ, ఆప్ నాయకుడు కేజ్రీవాల్, కాశ్మీర్ ప్రాంతీయ పార్టీ నాయకుడు అబ్దుల్ గఫార్ వంటివారు చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ప్రచారానికి వచ్చారు. చంద్రబాబు నాయుడ్ని తిరిగి గెలిపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎన్నికలు ముగిశాయి. ఫలితం తేలాల్సి ఉంది. ఈలోగానే చంద్రబాబు నాయుడికి మిత్రులని చెప్పుకుంటున్న నాయకుల రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. అక్కడికి వెళ్లి ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తానని చంద్రబాబు నాయుడు సైతం ప్రకటించారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అంచనా వేసిన ఇతర రాష్ట్రాల నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు తమకు అనుకూలంగా ప్రచారం చేయరాదని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనికి కారణం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదని వారు చెబుతున్నారు.

తమ రాష్ట్రాలలో కూడా ఈవీఎంల తోనే ఎన్నికలు జరుగుతాయని, ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు అంటూ ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు తమ రాష్ట్రాలకు వచ్చి అదే విషయాన్ని పదేపదే చెబితే ప్రజల్లో తాము చులకనవుతామని ఆయా రాష్ట్రాలకు చెందిన నాయకులు భయపడుతున్నట్లు సమాచారం.

దీనికి తోడు చంద్రబాబునాయుడుపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అని, దాని ప్రభావం తమ రాష్ట్రాల్లో కూడా ఉంటుందని ఆయా నాయకులు భయపడుతున్నట్లు సమాచారం. తెలుగు ప్రజల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న ఇతర రాష్ట్రాల నాయకులు, ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు చంద్రబాబు నాయుడిని ప్రచారానికి పిలిపించుకుని తమకు అనుకూలంగా తెలుగువారిని మార్చుకోవాలని భావించారు.

అయితే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న దశలో ఆయన చేత ప్రచారం చేయించుకోవడం తమకు నష్టం కలిగిస్తుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రచారానికి మాత్రం చంద్రబాబు సిద్దమైపోయాడు.

దీంతో చంద్రబాబు నాయుడిని ప్రచారానికి ఆహ్వానించాలా..? వద్దా..? అనే అంశంపై ఆయా రాష్ట్రాలకు చెందిన నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.

First Published:  17 April 2019 12:50 AM IST
Next Story