Telugu Global
NEWS

ఉత్తరాంధ్ర.... విజయంపై “దేశం”లో కలవరం...!

ఉత్తరాంధ్ర. ముచ్చటగా మూడు  జిల్లాలు. ఒడిషా రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న శ్రీకాకుళం…. అలనాటి రాజులు ఏలిన విజయనగరం…. ఆంధ్రప్రదేశ్ కు పర్యాటక రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖపట్నం…. ఈ మూడు జిల్లాల కలయికే ఉత్తరాంధ్ర. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ మూడు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు గానే ఉన్నాయి. ఈ మూడు జిల్లాలను ఉద్దండులైన నాయకులు తెలుగుదేశం పార్టీకి మార్గదర్శనం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్ర […]

ఉత్తరాంధ్ర.... విజయంపై “దేశం”లో కలవరం...!
X

ఉత్తరాంధ్ర. ముచ్చటగా మూడు జిల్లాలు. ఒడిషా రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న శ్రీకాకుళం…. అలనాటి రాజులు ఏలిన విజయనగరం…. ఆంధ్రప్రదేశ్ కు పర్యాటక రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖపట్నం…. ఈ మూడు జిల్లాల కలయికే ఉత్తరాంధ్ర.

నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ మూడు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు గానే ఉన్నాయి. ఈ మూడు జిల్లాలను ఉద్దండులైన నాయకులు తెలుగుదేశం పార్టీకి మార్గదర్శనం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో దక్కిన విజయాలు కారణమయ్యాయి.

అలాంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఈసారి గణనీయ సంఖ్యలో స్థానాలను కోల్పోవచ్చునని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూడు జిల్లాలోనూ కలిపి మొత్తం 34 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఈ 34 నియోజకవర్గాలలో 20 నుంచి 25 నియోజకవర్గాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఒడిషా రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కింజారపు కుటుంబానిదే ఇన్నాళ్లు పైచేయిగా ఉంది. ఆ కుటుంబానికి పెద్ద కింజారపు ఎర్రన్నాయుడు అన్నిటికీ తానే అయి పార్టీని ముందుండి నడిపించారు. ఆయన హఠాత్ మరణంతో తెలుగుదేశం పార్టీ ప్రాభల్యం కోల్పోతూ వచ్చింది.

కింజారపు ఎర్రన్నాయుడి తమ్ముడు అచ్చెన్నాయుడు చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే ఇటీవల ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఎర్రంనాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడు రాజకీయ ప్రవేశం చేసి పార్టీని తన వైపు తిప్పుకోగలిగారు అని అంటున్నారు.

దీంతో బాబాయ్, అబ్బాయ్ ల మధ్య రోజురోజుకు వివాదాలు ముదురుతున్నాయి. ఈ కుటుంబంలో వచ్చిన విభేదాల ప్రభావం జిల్లా తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా పడిందంటున్నారు. దీంతో జిల్లాలో ఉన్న పది స్ధానాల్లో తెలుగుదేశం పార్టీకి ఈసారి మూడు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు ఒంటెత్తు పోకడలు, మంత్రి సుజయ రంగారావు పార్టీ మారడం వంటి అంశాలు విజయావకాశాలను దెబ్బ తీస్తున్నాయి అని చెప్తున్నారు. ఆ జిల్లాలో బొత్ససత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది అంటున్నారు.

ఇలాంటి కారణాల వల్ల విజయనగరం జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్థిక, పర్యాటక రాజధానిగా పేరొందిన విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదు. ఎన్నికలకు ముందు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఎన్నికల అనంతరం ఆ భరోసాను ఇవ్వలేకపోతున్నారు. విశాఖ సిటీతో పాటు జిల్లాలోని మిగిలిన శాసనసభ స్థానాలలో ఘోర పరాజయం తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  16 April 2019 2:52 AM IST
Next Story