Telugu Global
NEWS

పవన్ పై పందెం... తూర్పు తిరిగి దండం..!

ఆయన తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా యువతీ యువకుల అభిమానులు ఉన్న సినీ స్టార్.. ఆయన కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్ లో ఓ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఆ వర్గం వారు చెప్పుకుంటున్న నాయకుడు. జనసేన పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేశారు పవన్ కళ్యాణ్. 175 శాసనసభ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలోనూ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఎన్నికల బరిలో […]

పవన్ పై పందెం... తూర్పు తిరిగి దండం..!
X

ఆయన తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా యువతీ యువకుల అభిమానులు ఉన్న సినీ స్టార్.. ఆయన కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్ లో ఓ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఆ వర్గం వారు చెప్పుకుంటున్న నాయకుడు.

జనసేన పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేశారు పవన్ కళ్యాణ్. 175 శాసనసభ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలోనూ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఎన్నికల బరిలో ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు శాసనసభ నియోజక వర్గాలలో పోటీ చేస్తున్నారు. తన స్వగ్రామం నరసాపురానికి అతి చేరువలో ఉన్న భీమవరం నియోజకవర్గం నుంచి, విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు.

సినీ హీరో కావడం, కుల మతాలు లేవంటూ ప్రకటించడం, యువతీ యువకుల మద్దతు ఆయనకే ఉంటుందని అందరూ భావించడంతో పవన్ కళ్యాణ్ విజయంపై ఆయన అభిమానులే కాదు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారు సైతం భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలలో భాగంగా పవన్ కళ్యాణ్ జయాపజయాలపై కోట్ల రూపాయల పందాలు కూడా వేసినట్లుగా సమాచారం.

ఎన్నికల ప్రకటన సమయంలో, ఆ తర్వాత ప్రచార సమయాల్లోనూ పవన్ కళ్యాణ్ విజయంపై అందరూ నమ్మకం గానే ఉన్నారు. అయితే రానురాను మారుతున్న పరిస్థితులు, పవన్ కళ్యాణ్ ప్రచార సరళిలో మార్పులు, తెలుగుదేశం పార్టీకి ఆయన మద్దతు పలుకుతున్నారని, లోపాయికారి ఒప్పందం పట్ల అనుమానాలు రావడంతో పవన్ కళ్యాణ్ విజయంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో తప్పనిసరిగా గెలుస్తాడు అని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పరాజయం పాలవుతారనే వారి సంఖ్య పెరుగుతోంది.

మరోవైపు ఈవీఎంలలో గందరగోళం ఉందంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేపట్టడం కూడా పవన్ కళ్యాణ్ విజయావకాశాలపై ప్రభావం చూపుతోంది అంటున్నారు. గెలుపోటములు ఏమైనా తాను ఒకేలా తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పినా…. ఆయనపై భరోసాతో పందెం కాసిన వారు మాత్రం తమ పరిస్థితి ఏమిటని బెంబేలు పడుతున్నట్టు సమాచారం.

భీమవరం నియోజకవర్గంలో ఓటమి పాలవుతారని తొలి నుంచీ సమాచారం ఉన్నా… గాజువాక లో మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారని అనుకున్నారు. రానురాను మారిన పరిస్థితుల దృష్ట్యా అక్కడ కూడా విజయం దక్కే అవకాశాలు లేవని చెబుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై పందెం…. తూర్పు తిరిగి దండం పెట్టడమేనా అని పందెం రాయుళ్లు వాపోతున్నారట.

First Published:  16 April 2019 2:55 AM IST
Next Story