Telugu Global
National

కమలంలో కలవరం...!

తొలి దశ పోలింగ్ తర్వాత కమలనాథుల్లో కలవరం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు 91 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి కనీసం ఐదు స్థానాలు అయినా దక్కవేమోననే భయం కమలనాథులను వెంటాడుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 42 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఒకటి, రెండు స్థానాలు తప్ప రావని తేలిపోయింది. అది కూడా తెలంగాణ రాజధాని హైదరాబాదులో గెలిచే […]

కమలంలో కలవరం...!
X

తొలి దశ పోలింగ్ తర్వాత కమలనాథుల్లో కలవరం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు 91 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి కనీసం ఐదు స్థానాలు అయినా దక్కవేమోననే భయం కమలనాథులను వెంటాడుతోంది.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 42 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఒకటి, రెండు స్థానాలు తప్ప రావని తేలిపోయింది. అది కూడా తెలంగాణ రాజధాని హైదరాబాదులో గెలిచే అవకాశాలు ఉన్నాయని కమలనాథులు చెబుతున్నారు.

ఇక మిగిలిన స్థానాల్లో పోటీ ఇస్తారు తప్ప గెలిచే అవకాశాలు లేవని తెలంగాణ బీజేపీ నాయకులే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ స్థానం మరింత దిగజారుతుందని, కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

ప్రత్యేక హోదా నిరాకరణతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ పై ఆగ్రహంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పోటీ అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య అంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కొత్తగా ప్రవేశించిన జనసేన మూడో స్థానంలో ఉంటుందని, భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు అనే అనుమానం ఆ పార్టీ నాయకుల్లో కలుగుతోంది.

తొలిదశలో జరిగిన సగం స్థానాలలో పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన స్థానాల్లో కూడా కమలం వికసించే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో తొలిదశలో భారతీయ జనతా పార్టీకి కేవలం నాలుగైదు స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందంటున్నారు.

మిగిలిన దశలలో జరిగే పోలింగ్ పైనే కమలనాథులు ఆశలు పెంచుకున్నారు. ఈ దశలలో కూడా తమకు మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశాలు లేవని కమలనాథుల్లో ఆందోళన పెరుగుతోంది.

జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల సహాయ సహకారాలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో కూడా ఇదే భయం వెంటాడుతోంది అని అంటున్నారు. కేంద్రంలో మరోసారి సొంతంగా అధికారాన్ని చేపట్టే అవకాశం బీజేపీకి అతి తక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First Published:  16 April 2019 6:27 AM GMT
Next Story