ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు పుకార్లు పుట్టిస్తున్నారు : వైసీపీ
ఏపీ ఎన్నికల పోలింగ్ రోజు టీడీపీ, వైసీపీ మధ్య తిరిగి మాటల యుద్దం మొదలైంది. ఈ సారి ఏకంగా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వైసీపీ స్పందించింది. సైకిల్‌కి నొక్కితే ఫ్యానుకు పడుతుందని, 30 శాతం ఈవీఎంలు పని చేయట్లేదని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై వైసీపీ మండిపడుతోంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ రాష్ట్ర సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి పిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలు పెద్ద ఎత్తున […]
ఏపీ ఎన్నికల పోలింగ్ రోజు టీడీపీ, వైసీపీ మధ్య తిరిగి మాటల యుద్దం మొదలైంది. ఈ సారి ఏకంగా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వైసీపీ స్పందించింది. సైకిల్‌కి నొక్కితే ఫ్యానుకు పడుతుందని, 30 శాతం ఈవీఎంలు పని చేయట్లేదని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై వైసీపీ మండిపడుతోంది.
చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ రాష్ట్ర సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి పిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలు పెద్ద ఎత్తున పని చేయట్లేదని సాక్షాత్తు చంద్రబాబు ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. చంద్రబాబు నిరాధారమైన వ్యాఖ్యలు కావాలనే చేస్తున్నారని ఆమె చెప్పారు.
ఈవీఎంలు పని చేయట్లేదని చెప్పి ఓటర్లు పోలింగ్ బూత్‌కు రాకుండా చేస్తున్నారని.. పోలింగ్ శాతం పెరిగితే టీడీపీకి నష్టమని, ఓడిపోతామని భావించే ఇలాంటి పుకార్లు పెట్టిస్తున్నారని ఆమె అన్నారు. ఎన్నికల కమిషన్ ఈవీఎంలు పని చేస్తున్నాయని చెబుతుంటే.. సీఎం మాత్రం విరుద్దమైన ప్రకటనలు చేయడమంటే ఓటమి భయం ఉందనే తెలుస్తుందన్నారు.
పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోపే రీపోలింగ్ కోసం చంద్రబాబు డిమాండ్ చేయడం హాస్యాస్పదమని వాసిరెడ్డి పద్మ అంటున్నారు.