Telugu Global
NEWS

బాబు హయాంలో ఆయన వాళ్ళకే పద్మ అవార్డులు

ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దారుణంగా జోక్యం చేసుకున్నారని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన పద్మ అవార్డులలో నలుగురు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే నని ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐ.వై.ఆర్.క్రిష్ణారావు ఓ నిజాన్ని బయటపెట్టారు. పద్మ అవార్డుల కోసం దేశ రాజధానిలో ఓ లాబీ నడించిందని ఆయన కుండబద్దలు కొట్టారు.  చంద్రబాబు దెబ్బకు పద్మ అవార్టులు ఇచ్చే నియమ నిబంధనలనే కేంద్ర ప్రభుత్వం మార్చేసిందని…. దానికి కారణం […]

బాబు హయాంలో ఆయన వాళ్ళకే పద్మ అవార్డులు
X

ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దారుణంగా జోక్యం చేసుకున్నారని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన పద్మ అవార్డులలో నలుగురు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే నని ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐ.వై.ఆర్.క్రిష్ణారావు ఓ నిజాన్ని బయటపెట్టారు. పద్మ అవార్డుల కోసం దేశ రాజధానిలో ఓ లాబీ నడించిందని ఆయన కుండబద్దలు కొట్టారు.

చంద్రబాబు దెబ్బకు పద్మ అవార్టులు ఇచ్చే నియమ నిబంధనలనే కేంద్ర ప్రభుత్వం మార్చేసిందని…. దానికి కారణం భారతదేశంలో నలుగురు డాక్టర్లకు పద్మ అవార్డులు ఇస్తే ఆ నాలుగూ ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయని…. ఆ నలుగురూ చంద్రబాబు కులానికే చెందిన వారని…. ఈ విషయంలో దేశం మొత్తం మీద నుంచి విపరీతంగా కేంద్రానికి ఫిర్యాదులు వెళ్ళడంతో కేంద్రప్రభుత్వం ఆ తరువాత ఏడాది నుంచి పద్మ అవార్డుల కోసం సిఫార్సులను రాష్ట్రాలను అడగకుండా ప్రజలనుంచే స్వీకరించేలా నిబంధనలను మార్చడానికి చంద్రబాబే కారణం అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

“చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేనంతగా కులపిచ్చి పెరిగిపోయింది” అని ఆయన అన్నారు. శనివారం ఓ ఛానెల్ ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ఐ.వై.ఆర్.క్రిష్ణారావు కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అన్ని రంగాలలో దిగజారి పోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రధాన భూమిక పోషించిందని… అక్కడి నుంచి వచ్చిన సూచనలు, సలహాలతోనే రాష్ట్రంలో పాలన సాగుతోందని ఆయన అసలు విషయం వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తన అధికారంలో ఎక్కడా ప్రాంతీయ సమానత్వాన్ని పాటించలేదనడానికి అనేక ఉదాహరణలున్నాయని, అలాగే సామాజిక న్యాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారని ఐ.వై.ఆర్.క్రిష్ణారావు ఈ సందర్భంగా తెలిపారు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు సహాయపడ్డ కొద్ది మంది ధనవంతుల కోసం ఆయన ప్రభుత్వంలో గేట్లు బార్లా తెరిచాడని…. వాళ్ళు బాగా దోచుకున్నారని చెప్పారు.

ప్రతిపక్షంలో తొమ్మిదేళ్ళు ఉండి అధికారంలోకి రాగానే ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని…. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకు సుపరిపాలన అందించేకన్నా…. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు దోచిపెడితే ఆ తరువాత ఎన్నికలప్పుడు వాళ్ళే డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారన్న చంద్రబాబు నమ్మకమే ఇలాంటి అవినీతి పాలనకు కారణం అని ఐవైఆర్ అన్నారు.

చంద్రబాబు నాయుడు ఒక దశలో ఆచరణ సాధ్యంకాని, అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చే స్ధితిలోకి వెళ్లిపోయారని, దీనికి కారణం ఆయన హైదరాబాద్ నే నేను నిర్మించాను… అమరావతి ఎంత అనే ఓ అహంకార ధోరణి వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని ఐవైఆర్ అన్నారు.

“తానే అన్నీ చేయగలనని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. ఇది కీర్తి కండూతి కూడా కాదు. ఒకవేళ కీర్తే అనుకుంటే చాలా బాగా చేసేవారు. రూల్స్ ను పక్కదారి పట్టించి పని చేసేందుకే చంద్రబాబు నాయుడు, ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ప్రాధాన్యత ఇచ్చాయి” అని ఐవైఆర్ కుండబద్దలు కొట్టారు.

చంద్రబాబు నాయుడిలో మాటలు ఎక్కువ… చేతలు తక్కువ గాను ఉండేవని, క్షేత్ర స్ధాయిలో ఏ పనీ జరగకుండా ఊరికే మాటలకే ప్రాధాన్యత ఇస్తే ఎదురుదెబ్బ తగలక తప్పదని ఆయన చెప్పారు.

ప్రభుత్వ తీరు నచ్చనప్పుడు బయటకు వచ్చేయచ్చు కదా అని చాలా మంది భావించారని, అయితే తాను పని చేస్తున్నది తన జీతం, తన ఫించను కోసమే అని తన పని తాను చేసుకుపోయానని ఐవీఆర్ స్పష్టం చేశారు.

” ప్రభుత్వ పరంగా వారి పని వారి చేసుకున్నారు. అధికారిగా నా పని నేను చేశాను” అని ఆయన అన్నారు. నేను నా దగ్గరకు వచ్చిన ఫైళ్లకే నేను సమాధానం చెప్పాల్సి ఉందని, మిగిలిన అంశాలతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు.

First Published:  7 April 2019 5:58 AM IST
Next Story