మాయావతిని ఆపండి బాబు.... తమ్ముళ్ల మొర !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ జనసేనకు ఓటు వేయాలంటూ బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. ఈనెల 4వ తేదీన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని జనసేన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణలో జనసేనకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా ఒకరిద్దరు అభ్యర్థుల కోసం మాయావతిని హైదరాబాదుకు తీసుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ప్రచార సభ ముగిసిన తర్వాత మాయావతిని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ జనసేనకు ఓటు వేయాలంటూ బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. ఈనెల 4వ తేదీన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని జనసేన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణలో జనసేనకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా ఒకరిద్దరు అభ్యర్థుల కోసం మాయావతిని హైదరాబాదుకు తీసుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్.
తెలంగాణలో ప్రచార సభ ముగిసిన తర్వాత మాయావతిని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం తీసుకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. నెలరోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో కలిసి లక్నో వెళ్లారు. అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతిని కలుసుకుని జనసేనకు మద్దతు పలకాలని అభ్యర్థించారు.
పవన్ కోరికను మన్నించిన మాయావతి అప్పటికప్పుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తన ఆకాంక్షను వెల్లడించారు. జనసేన తరఫున ప్రచారం చేసేందుకు తెలుగు రాష్ట్రాలకు వస్తానని హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ మేరకు మాయావతి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు వస్తున్నారని జనసేన తన అధికారిక ప్రకటనలో ప్రకటించింది.
మాయావతి… ఆమె ఇచ్చిన హామీ మేరకు జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాయావతి పర్యటన జరిగితే, బహిరంగ సభలలో పాల్గొని జనసేనకు ఓటు వేయాలంటూ కోరితే తాము పూర్తిగా నష్టపోతామని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభ్యర్థులు కంగారు పడుతున్నట్టు సమాచారం.
గడచిన 20 రోజులుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఆయన తన బహిరంగ సభల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వల్ల తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో మాయావతి వచ్చి జనసేనకు అనుకూలంగా ప్రచారం చేస్తే తమ విజయావకాశాలపై భారీ దెబ్బ పడుతుందని తెలుగుదేశం అభ్యర్థులు కంగారు పడుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మాయావతి పర్యటించకుండా చూడాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలుగు తమ్ముళ్లు విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం.
ముందుగా నిర్ణయించిన మేరకు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కే పరిమితం అయ్యేలా చూడాలని, అంతకు మించి ఆంధ్రప్రదేశ్ కు రాకుండా చూసే బాధ్యత చంద్రబాబుదేనని తెలుగు తమ్ముళ్లు చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బీసీలు, దళితులు, మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని, మాయావతి ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తే తెలుగుదేశం పార్టీకి మిగిలిన కొద్దిపాటి బీసీ, దళిత ఓట్లు జనసేన వైపు పోతాయని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మాయావతి ఆంధ్రప్రదేశ్ పర్యటన జరగకుండా చూసే బాధ్యత చంద్రబాబుదేనంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.