విందు కళ వచ్చిందే బాలా...
ఎన్నికలు వచ్చేశాయి. కోడ్ నగారా మోగిందంటే ఇక గవర్నమెంట్ విధులకు చేతులు కట్టేసినట్లే. పార్టీలు, నాయకుల విధులు మొదలవుతాయి. నాయకులకూ చేతులు కట్టేసే నిబంధనలుంటాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదనే నియమావళి ఉంటుంది. అయినా పోలింగ్‌కు ముందు రోజు డబ్బు, మద్యం ప్రవహిస్తాయి. ఓట్లు గుప్తంగా, రహస్యంగా పడిపోతాయి. ఇది మనకు తెలిసిన ఎన్నికల విధానం. అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రం ఎన్నికల కళ వేరుగా ఉంటుంది. విందు… మందు అరుణాచల్ ప్రదేశ్‌లో దిబాంగ్ వ్యాలీకి ఎన్నికల కళ […]
ఎన్నికలు వచ్చేశాయి. కోడ్ నగారా మోగిందంటే ఇక గవర్నమెంట్ విధులకు చేతులు కట్టేసినట్లే. పార్టీలు, నాయకుల విధులు మొదలవుతాయి. నాయకులకూ చేతులు కట్టేసే నిబంధనలుంటాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదనే నియమావళి ఉంటుంది. అయినా పోలింగ్‌కు ముందు రోజు డబ్బు, మద్యం ప్రవహిస్తాయి. ఓట్లు గుప్తంగా, రహస్యంగా పడిపోతాయి. ఇది మనకు తెలిసిన ఎన్నికల విధానం. అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రం ఎన్నికల కళ వేరుగా ఉంటుంది.
విందు… మందు
అరుణాచల్ ప్రదేశ్‌లో దిబాంగ్ వ్యాలీకి ఎన్నికల కళ సంతరించుకుంది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి పార్టీలన్నీ. అన్ని పార్టీ ఆఫీసుల్లోనూ లాంచనంగా అభ్యర్థులు, పార్టీ పెద్దలకు విందు భోజనాలు జరిగాయి. పందిమాంసం, మంచి నీటి చేపలు, ఆకు కూరలు, బిన్న బంగాళాదంపల కూరలు, ఫిజ్జీ డ్రింక్ నుంచి ఆల్కాహాల్ వరకు రకరకాల పానీయాలతో విందు విజయవంతమైంది.
ఇదంతా వాళ్ల వాళ్ల నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లబోయే అభ్యర్థులకు ఓరియెంటేషన్ సెషన్ విందు. ఇక వాళ్లంతా తమ తమ నియోజక వర్గాలకు వెళ్లి గ్రామస్తులకు ఇలాంటి విందునే ఏర్పాటు చేయాలి. ఇది ఒకరోజు తంతు కాదు. అభ్యర్థి పేరు ఖరారైనప్పటి నుంచి ఎన్నికలయ్యే వరకు రోజూ జరగాల్సిన కార్యక్రమం. దాదాపుగా ఈ నెల్లాళ్లు అరుణాచల్ ప్రదేశ్‌లోని చాలా ఇళ్లలో పొయ్యి వెలగదు. పొయ్యి వెలిగించకుండా సుష్టుగా విందు భోజనాలను ఎంజాయ్ చేస్తుంటారు.
పైన చెప్పిన మెనూ తొలి రెండు వారాల వరకే. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అభ్యర్థులు పోటీ పడి మరీ మరిన్ని ఎక్కువ రకాలతో ఓటర్లను సంతోష పెట్టాల్సి ఉంటుంది. విందుతో పాటు మందు కూడా. నియోజకవర్గం మొత్తానికీ ఇలా భోజనం పెట్టాల్సిందే. అయితే మన దగ్గర ఉన్నట్లు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి లక్షలాది ఓటర్లు ఉండరక్కడ.
అసెంబ్లీ నియోజకవర్గం అంటే సరాసరిన 12 వేల మంది ఓటర్లుంటారు. ఇలా మంచి భోజనం పెట్టేస్తే చాలా… ఓట్లేసేస్తారా… అనుకుంటే అంతకంటే వెర్రిపప్పలు మరొకరుండరు. వీటన్నింటితోపాటు ఒక్కో ఓటుకి పాతిక వేలు డబ్బులివ్వాలి. మనకు చదివేటప్పుడే గుండె పోటు వస్తుంటే ఇక అక్కడి నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో మరి.
30 కోట్లు ఉంటేనే సీటు
అభ్యర్థికి సీటిచ్చేటప్పుడు పార్టీలు ఏ మాత్రం మొహమాట పడడం లేదట. అభ్యర్థికి బంధువర్గం, బలగం ఎంత ఉంది? డబ్బు ఎంత ఉంది? వంశచరిత్ర, గుర్తింపు పొందిన కుటుంబానికి చెందిన వ్యక్తేనా… వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని మాత్రమే టికెట్ ఖరారు చేస్తున్నాయట పార్టీలు.
ఏతావాతా చెప్పేదేమిటంటే… ఎన్నికలు డబ్బు ప్రధానంగా మాత్రమే జరుగుతాయి. ఈ వింత ధోరణిని నాయకులే ప్రోత్సహిస్తున్నారేమోనని… ఓ క్షణం అనిపిస్తుంది. కానీ నాయకులను కదిలిస్తే ఏడుపొక్కటే తక్కువగా స్పందించారు.
”అభ్యర్థి ఒకసారి గెలిచిన తర్వాత మనకు ఏమేం పనులు చేశారనేది సెకండరీ కూడా కాదు, అభ్యర్థి డబ్బు, విందు, మందు తర్వాత నాలుగు లేదా ఐదో ప్రాధాన్యత అంశం అవుతోంద”ని అరుణాచల్‌ప్రదేశ్ ఈస్ట్ పార్లమెంట్ ఎంపీ లీతా ఉంబ్రె వాపోయారు.
మరో పార్టీ నాయకుడు కూడా తన జీవితంలో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ రాజకీయరంగంలో అడుగుపెట్టడమేనన్నాడు.
వైద్యం చేయాలని ఎవరైనా గొప్ప సంస్కర్త ముందుకు వచ్చినా సరే… వైద్యం ఎక్కడ నుంచి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక తల గోడకేసి కొట్టుకోవాల్సిందే.