జన స్పందన కరువై బాబు డీలా!
మీకు అండగా నేను ఉంటాను, అవసరాలన్నీ తీరుస్తాను. మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి…. అంటూ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమంగా ఢీలా పడిపోతున్నారు. ఇప్పటికే అమలులో ఉండే పథకాలనే పదేపదే కొత్తగా ప్రకటిస్తూ, ప్రతిపక్షం ఎప్పుడో ప్రకటించిన పథకాలను కాపీ కొడుతూ, ఇన్నాళ్లూ కథ నడిపించిన చంద్రబాబు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ మానసికంగా బలహీనపడుతున్నట్టు కనిపిస్తోంది. ”మీ భవిష్యత్తు నా బాధ్యత” అన్న చంద్రబాబు ”తన రక్షణే ప్రజల బాధ్యత” అంటున్నారు. తనను […]

మీకు అండగా నేను ఉంటాను, అవసరాలన్నీ తీరుస్తాను. మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి…. అంటూ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమంగా ఢీలా పడిపోతున్నారు.
ఇప్పటికే అమలులో ఉండే పథకాలనే పదేపదే కొత్తగా ప్రకటిస్తూ, ప్రతిపక్షం ఎప్పుడో ప్రకటించిన పథకాలను కాపీ కొడుతూ, ఇన్నాళ్లూ కథ నడిపించిన చంద్రబాబు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ మానసికంగా బలహీనపడుతున్నట్టు కనిపిస్తోంది.
”మీ భవిష్యత్తు నా బాధ్యత” అన్న చంద్రబాబు ”తన రక్షణే ప్రజల బాధ్యత” అంటున్నారు. తనను రక్షించుకోవాలంటూ ఎన్నికల సభల్లో ప్రజలనే కోరుతూ బేలతనం ప్రదర్శించడం చూస్తే, ఒక ముఖ్యమంత్రిని ప్రజలు రక్షించుకోవడం ఏమిటని విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
జనమే రక్షించుకోవాల్సిన దుర్గతి ఓ ముఖ్యమంత్రికి పట్టిందంటే, ఆయన మానసిక దౌర్బల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని వారంటున్నారు. ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటి నుంచీ జరిగిన పరిణామాల్లో రికార్డు సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీకి గుడ్ బై చెప్పేసి, ప్రతిపక్షంలో చేరి జగన్ కు జైకొట్టడం, ఐదేళ్లలో తానేమి చేశానో చెప్పుకోలేకపోవడం, ఇన్నాళ్లూ తనకు అండగా కదలివచ్చిన సినిమాదండు కూడా తనకు దూరం కావడం, తాను నమ్ముకున్న తనయుడు లోకేష్ బాబు కూడా ప్రచారంలో ఎప్పటికప్పుడు తన అసమర్థతను నిలబెట్టుకోవడం, ప్రతిపక్ష నేత కుటుంబంపై తాను సాగించిన దుష్ప్రచారం కూడా ఆశించిన ఫలితాలనివ్వకపోవడం….ఈ పరిణామాలతో చంద్రబాబు ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నదని, ఎన్నికల్లో టీడీపీకి ఏ గతి పట్టనుందో చంద్రబాబుకు ఇప్పటికే లీలగా అవగతమైనట్టు కనిపిస్తోందని అంటున్నారు.
ప్రచారం మొదలైనప్పటి నుంచీ, తన సభలకు ఏదో మొక్కుబడిగా నాయకులు జనాలను తరలిస్తూ ఉన్నా, సభల్లో తానుచేసే ప్రసంగానికి జనస్పందన లేకపోవడం కూడా ఆయన్ను తీవ్రంగా బాధిస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగా చంద్రబాబు ప్రకటించిన పథకాలేవీ జనాలను పెద్దగా ఆకర్షించకపోవడం, వై.ఎస్. జగన్ పథకాలను, హామీలను కాపీ కొట్టారంటూ ఆయనమీద సెటైర్లు పెరగడం కూడా బాబును ఇబ్బందిపెడుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో కర్తవ్యం బోధపడక టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది.
దీనికి తోడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ సభలకు, రోడ్డు షోలకే కాక, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల సభలకు జనాలు పొటెత్తుతూ ఉండటం టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబులో బేలతనం, అపనమ్మకం పెరిగిందని, ఎన్నికల్లో పరాభవం తప్పదని తెలియడంతోనే తనను రక్షించుకోవాల్సిన బాధ్యత జనాలదే అంటూ వేడుకోలు మొదలు పెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు.