Telugu Global
NEWS

తెలంగాణ ప్రజలు దేవుళ్ళలాంటి వాళ్ళు....

తెలంగాణలో ఆంధ్రావాళ్లందరూ సుఖంగా, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఏ ఆంధ్రా వాడిని కూడా తెలంగాణ వ్యక్తులు కొట్టలేదు తిట్టలేదు.. మరి అలాంటప్పుడు అనవసరమైన రాద్దాంతం చేయడం ఎందుకని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. అసలు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు దేవుళ్ళ లాంటి మనుషులని, వాళ్ళు మన ఇంటికి వస్తే చాయ్ తాపిస్తేనే ఎంతో సంతోషిస్తారని…. అలాంటి మంచి మనుషుల గురించి ఇంత […]

తెలంగాణ ప్రజలు దేవుళ్ళలాంటి వాళ్ళు....
X

తెలంగాణలో ఆంధ్రావాళ్లందరూ సుఖంగా, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఏ ఆంధ్రా వాడిని కూడా తెలంగాణ వ్యక్తులు కొట్టలేదు తిట్టలేదు.. మరి అలాంటప్పుడు అనవసరమైన రాద్దాంతం చేయడం ఎందుకని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. అసలు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజలు దేవుళ్ళ లాంటి మనుషులని, వాళ్ళు మన ఇంటికి వస్తే చాయ్ తాపిస్తేనే ఎంతో సంతోషిస్తారని…. అలాంటి మంచి మనుషుల గురించి ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడతారని పోసాని ప్రశ్నించాడు.

కేసీఆర్ దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నది ఎవరు..? గొప్ప ముఖ్యమంత్రి అని పొగిడింది ఎవరో? చెప్పాలని పోసాని ఎద్దేవా చేశారు. అసలు ఒక పత్రిక రాసిన వార్తలు పూర్తిగా చూడకుండా ఒక పార్టీ అధినేత ఎలా స్పందిస్తారని పోసాని ప్రశ్నించారు.

ఒకానొకప్పుడు తెలంగాణ ప్రజలను స్పూర్తిగా తీసుకోవాలని చెప్పిన వ్యక్తి ఇవాళ ఎందుకు వారిపై విషం చిమ్ముతున్నాడని ఆయన అడిగారు. అసలు తెలంగాణ, హైదరాబాద్‌లలో ఆంధ్రా వాళ్లను ఎవరు కొట్టారు, తిట్టారని ఆయన నిలదీశారు.

తెలంగాణలో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా.. ఒక్క నేతతో అయినా నన్ను బెదిరించారని నిజం చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

పలికించేది ఒకడు.. పలికేది ఒకడులా మారిపోయిందని చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పోసాని అన్నారు. కేసీఆర్‌కు బెదిరించాల్సిన అవసరం ఏముంది.. చంద్రబాబు కూడా ఇలాగే బెదిరించి వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్లారా అని అడిగారు.

చివరిగా ఒకటే చెబుతున్నా.. ఆంధ్రా ప్రజలను కేసీఆర్ గానీ, తెలంగాణ ప్రజలు కాని ఏనాడూ దెబ్బలు కొట్టలేదు.. తిట్టలేదు.. అవన్నీ చంద్రబాబు, పవన్ చేస్తున్న రాజకీయాలేనని ఆయన చెప్పారు. మీ అన్న నాగబాబు కేసీఆర్ పాలన బాగుంది అని కితాబు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించాడు.

ఇలాంటి రాజకీయాలు ఆంధ్రా, తెలంగాణ మధ్య తీసుకొని రావద్దు… తెలంగాణ పాకిస్తానా అనే మాటలు మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్ అని పోసాని హితవు పలికారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇదే తెలుగుదేశం వాళ్ళు అసభ్యంగా మాట్లాడిన విషయం గుర్తుంచుకోవాలని పోసాని చెప్పారు.

ఏదేమైనా నిన్న భీమవరంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇరు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

First Published:  23 March 2019 11:54 AM IST
Next Story