Telugu Global
National

బీజెపీలో గౌతమ్ గంభీర్.. న్యూఢిల్లీ నుంచి పోటీ..?

టీమిండియా మాజీ ఓపెనర్ ఇక పొలిటికల్ ఇన్నింగ్స్ వన్డే ప్రపంచకప్, ఐపీఎల్ కోల్‌కతా విజేత జట్లలో సభ్యుడు క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలవైపు చూపు ఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభ బరిలో గౌతమ్ గంభీర్ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇవాళ అరుణ్ జైట్లీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఢిల్లీ లోక్‌స‌భ స్థానం నుంచి పార్లమెంట్‌లో అడుగుపెట్టడానికి తహతహలాడుతున్నాడు. గత ఏడాదే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల గంభీర్… గత […]

బీజెపీలో గౌతమ్ గంభీర్.. న్యూఢిల్లీ నుంచి పోటీ..?
X
  • టీమిండియా మాజీ ఓపెనర్ ఇక పొలిటికల్ ఇన్నింగ్స్
  • వన్డే ప్రపంచకప్, ఐపీఎల్ కోల్‌కతా విజేత జట్లలో సభ్యుడు
  • క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలవైపు చూపు
  • ఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభ బరిలో గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇవాళ అరుణ్ జైట్లీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఢిల్లీ లోక్‌స‌భ స్థానం నుంచి పార్లమెంట్‌లో అడుగుపెట్టడానికి తహతహలాడుతున్నాడు. గత ఏడాదే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల గంభీర్… గత కొంత కాలంగా సోషల్ మీడియా ద్వారా తనలోని దేశభక్తిని వ్యక్తం చేస్తూ అందరి ద‌‌ృష్టిని ఆకర్షించాడు. సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్‌కు 90 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ పని తీరు, నిజాయితీ నచ్చి తాను బీజెపీలో చేరాలని నిర్ణయించుకొన్నట్లు గంభీర్ ఢిల్లీలో ప్రకటించాడు. గంభీర్‌కు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ పార్టీలోకి స్వాగతం పలికారు.

న్యూఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న గంభీర్ గత దశాబ్దకాలంగా భారత క్రికెట్‌లో తన హవా కొనసాగిస్తూ వచ్చాడు. టీమిండియా ఓపెనర్‌గా.. ఢిల్లీ, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు కెప్టెన్‌గా సేవలు అందించాడు. 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలు సాధించిన భారతజట్టులో సభ్యుడిగా ఉన్న గంభీర్‌కు 147 వన్డేలు ఆడిన రికార్డు ఉంది.

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో 58 మ్యాచ్‌లు ఆడి 9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు సాధించాడు. గత సీజన్లో ఢిల్లీ తరపున ఆంధ్రతో జరిగిన రంజీమ్యాచ్ ఆడి సెంచరీ సాధించిన తర్వాత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఎన్నికల్లో పోటీ ఆలోచన లేదు : గంభీర్

తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని.. తన కుటుంబం కోసం పూర్తిగా సమయం కేటాయించాల్సిన సమయం వచ్చిందని గంభీర్ అన్నాడు. గతంలో క్రికెట్ కారణంగా తన కుటుంబానికి చాలా దూరమయ్యానని గంభీర్ తెలిపాడు. మరోవైపు గంభీర్‌ను ఢిల్లీ స్థానం నుంచి పోటీకి దించుతారా అన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

సీట్లు కేటాయించే విషయాన్ని చూసుకోడానికి ప్రత్యేక కమిటీ ఉందని.. గంభీర్‌ను ఎన్నికల్లో నిలిపేది లేనిదీ నిర్ణయించాల్సింది బీజెపీ అధిష్టానమేనని తెలిపారు. మొత్తం మీద తొలిదశలో క్రికెటర్‌గా గుర్తింపు ఆ తర్వాత సామాజిక సమస్యల మీద పోరాడే వ్యక్తిగా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకొన్న గంభీర్… చివరగా తన గమ్యం రాజకీయాలేనని బీజెపీలో చేరడం ద్వారా చెప్పకనే చెప్పాడు.

First Published:  22 March 2019 3:21 AM GMT
Next Story