Telugu Global
Others

జర్నలిస్టులపై బీజేపీ కత్తి

ప్రసిద్ధ పత్రికా రచయిత, టీవీ ప్రయోక్త పుణ్య ప్రసూన్ వాజపేయి మళ్లీ రోడ్డున పడ్డారు. ఆయన ఇటీవలే సూర్యసమాచార్ అనే టీవీ చానల్ ప్రధాన సంపాదకుడిగా చేరారు. ఆయనతో పాటు మరో 25 మంది ఆయన అనుయాయులు కూడా చేరారు. పుణ్య ప్రసూన్ తో సహా మిగతా 25 మందిని మార్చి 31 నుంచి ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్టు ఆ పత్రిక యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. ఈ చానల్ యజమాని ప్రియా గోల్డ్ అండ్ ఆగ్రో సంస్థ […]

జర్నలిస్టులపై బీజేపీ కత్తి
X

ప్రసిద్ధ పత్రికా రచయిత, టీవీ ప్రయోక్త పుణ్య ప్రసూన్ వాజపేయి మళ్లీ రోడ్డున పడ్డారు. ఆయన ఇటీవలే సూర్యసమాచార్ అనే టీవీ చానల్ ప్రధాన సంపాదకుడిగా చేరారు. ఆయనతో పాటు మరో 25 మంది ఆయన అనుయాయులు కూడా చేరారు.

పుణ్య ప్రసూన్ తో సహా మిగతా 25 మందిని మార్చి 31 నుంచి ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్టు ఆ పత్రిక యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. ఈ చానల్ యజమాని ప్రియా గోల్డ్ అండ్ ఆగ్రో సంస్థ అధిపతి. ఆ సంస్థ బిస్కెట్లు తయారు చేస్తుంది.
పుణ్య ప్రసూన్ స్వతంత్ర ఆలోచనలుగల పత్రికా రచయిత.

అందుకే ఆయన ఎక్కడా ఇమడలేక పోతున్నారు. ఆయన నిర్మొహమాటంగా మోదీ ప్రభుత్వాన్ని ఎండగడ్తారు. అది ఏలిన వారికి నచ్చడం లేదు. 2018 ఆగస్టు మొదటి వారంలో పుణ్య ప్రసూన్ ఏబీపీ న్యూస్ చానల్ నుంచి తప్పుకోవలసి వచ్చింది.

ఆ చానల్ లో ఆయన “మాస్టర్ స్ట్రోక్” అనే కార్యక్రమం నిర్వహించే వారు. ఛత్తిస్ గఢ్ లోని ప్రభుత్వ పథకాల లబ్ధిదార్లతో ప్రధానమంత్రి మోదీ 2018 జూన్ 20న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ క్రమంలో చంద్రమణి కౌశల్ అనే మహిళ తాను వరి పండించడం మానేసి సీతాఫలాలు పండించడంవల్ల తన ఆదాయం రెట్టింపైంది అని చెప్పారు.

తీరా చూస్తే అధికారులు చంద్రమణి చేత చిలకపలుకులు పలికలించారని తేలింది. తన బృందాన్ని ఛత్తీస్ గఢ్ పంపి పుణ్య ప్రసూన్ ఈ బండారం బయట పెట్టారు. మోదీ మంత్రివర్గ సభ్యులు అగ్గి మీద గుగ్గులమయ్యారు. ఒక ప్రభుత్వాధికారి పుణ్య ప్రసూన్ కు ఫోన్ చేసి పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

ఆ తరవాత పుణ్య ప్రసూన్ “మాస్టర్ స్ట్రోక్” ప్రసారమయ్యే సమయంలో ఏబీపీ న్యూస్ ఉపగ్రహ సంబంధాలు ఊగిసలాడడం మొదలైంది. వరసగా మూడు రోజులు ఇలాగే జరిగింది. ఆ చానల్ కు వ్యాపార ప్రకటనలు ఇచ్చే వారిని కూడా బెదిరించారు. పుణ్య ప్రసూన్ రాజీనామా చేసిన తరవాత ఉపగ్రహ సంకేతాలు యథావిధిగా అందాయి.

అంతకు ముంది ఆ చానల్ యజమాని, ప్రధాన సంపాదకుడు “మోదీ పేరెత్తకుండా మీరు మాట్లాడాలి. కావాలంటే ఆయన మంత్రివర్గంలోని వారి పేర్లు ప్రస్తావించవచ్చు. ప్రభుత్వ విధానాలలోని లోపాలను కూడా ఎత్తి చూపవచ్చు. దయచేసి మోదీ పేరెత్తకండి” అని పుణ్య ప్రసూన్ కు చెప్పారు.

నిజానికి “మాస్టర్ స్ట్రోక్” లో పుణ్య ప్రసూన్ ఛత్తిస్ గఢ్ ఉదంతం గురించి వార్త ప్రసారం చేసిన తరవాత ఆ చానల్ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. కానీ బీజేపీ ఆ చానల్ ను బహిష్కరించడం మొదలు పెట్టింది. ఉపగ్రహ సంకేతాలు అందకుండా చేయడమే కాక అలా జరిగిందని బయటికి చెప్పకూడదని ఏలినవారు హెచ్చరించారు.

బాబా రాందేవ్ తయారు చేసే వస్తువుల వ్యాపార ప్రకటనలు రావడం ఆగిపోయింది. ఇతర ప్రకటనలూ రాలేదు. అంటే ఏబీపీ న్యూస్ ను లొంగదీయడానికి ఆ చానల్ ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టారు. అప్పుడు పుణ్య ప్రసూన్ రాజీనామా చేయక తప్పలేదు. ఆయన రాజీనామా తరవాత ఉపగ్రహ సంకేతాలు భేషుగ్గా అందాయి. పతంజలి వ్యాపార ప్రకటనలూ దండిగా వచ్చాయి.

ఇదీ మన మేడిపండు ప్రజాస్వామ్యం. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు పత్రికల మీద బోలెడు ఆంక్షలు ఉండేవి. అవన్నీ బహిరంగ ఆంక్షలే. పత్రికా రచయితలు ఏం చేయకూడదో తెలిసేది. ఇప్పుడు అలా కాదు ముందు ప్రభుత్వాధికారులు, మంత్రులు సదరు పత్రికా రచయితకు ఫోన్లు చేసి హెచ్చరిస్తారు. వినకపోతే యజమానులకు ఫిర్యాదు చేస్తారు. ఇక అంతటితో ఆ సంస్థలో ఆ పత్రికా రచయిత కథ ముగుస్తుంది.

మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే బీజేపీ సీనియర్ నాయకుడు అడ్వాణీ మళ్లీ ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉంది అని హెచ్చరించారు. కానీ ఎమర్జెన్సీ విధించకుండానే ఎవరిని ఎలా లొంగదీయాలన్న విషయంలో మోదీ సర్కారు అపారమైన నైపుణ్యం సాధించింది. “స్కిల్ డెవలప్‌ మెంట్” అదే ఇదే కాబోలు!

బీజేపీ వేటాడుతున్న పత్రికా రచయిత పుణ్య ప్రసూన్ ఒక్కరే కాదు. మిగతా వారికి ఉద్యోగాలు ఇంకా ఊడలేదు కానీ సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు, చంపేస్తాం అన్న హెచ్చరికలు మామూలు అయిపోయాయి.

First Published:  21 March 2019 12:09 PM IST
Next Story