ఆ ఓట్ల కోసమే కేసీఆర్ మాటల పదును తగ్గిందా?
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నారా చంద్రబాబు నాయుడు. ఆ ఇద్దరు నాయకులకు మధ్య ఏ పార్టీ జెండా వేసినా భగ్గుమంటోంది ఇప్పుడు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి గడిచిన ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు పై చేసిన పదునైన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రోజుకో కొత్త విమర్శతో చంద్రబాబునాయుడిని ఉక్కిరిబిక్కిరి చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రిటన్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా […]
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నారా చంద్రబాబు నాయుడు. ఆ ఇద్దరు నాయకులకు మధ్య ఏ పార్టీ జెండా వేసినా భగ్గుమంటోంది ఇప్పుడు.
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి గడిచిన ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు పై చేసిన పదునైన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రోజుకో కొత్త విమర్శతో చంద్రబాబునాయుడిని ఉక్కిరిబిక్కిరి చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రిటన్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా ఓ ప్రకటన చేశారు కేసీఆర్.
నెల రోజుల క్రితం వరకు కేసీఆర్… చంద్రబాబు నాయుడుల మధ్య విమర్శల హోరు తారాస్థాయికి చేరింది. అయితే, గడచిన 20 రోజులుగా మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పల్లెత్తు మాట అనటం లేదు. ఇటు తెలంగాణలోనూ… అటు ఆంధ్రప్రదేశ్ లోనూ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే టాపిక్ చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది. ఇక్కడ ఉన్న 16 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలకు కేసీఆర్ పదును పెడుతున్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు కొన్ని ఉన్నాయి.
కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ తెలంగాణ లోక్ సభ స్థానాలు అన్నింటిలో కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన వారిని ప్రసన్నం చేసుకునేందుకే ఆయనపై ఎలాంటి మాటలు విసరడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్టీ నాయకులు చెబుతున్నారు.
తెలంగాణలో సెటిల్ అయిన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి. లోక్ సభ ఎన్నికలలో చంద్రబాబునాయుడుపై కొన్ని విమర్శలు చేసి ఇక్కడున్న ఆయన సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే లోక్ సభ ఫలితాలు ఎలా ఉంటాయో అనే గుబులు కేసీఆర్ ను వెంటాడుతోందని అంటున్నారు.
ఈ పరిస్థితులను అంచనా వేసుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలలో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదని, ఇక్కడ శాశ్వత శత్రువులూ శాశ్వత మిత్రులూ ఉండరని రాజకీయ పండితులు చెబుతున్నారు.