ఒకవైపు వామపక్షాలతో ఒప్పందం.... మరోవైపు టీడీపీతో బేరసారాలు?
వామపక్షాలు. సిపిఐ, సిపిఎం పార్టీలు. బడుగు, బలహీన పేద వర్గాలకు చెందిన పార్టీలుగా పేరు తెచ్చుకున్న కమ్యూనిస్టు పార్టీలు. వాళ్లకు వాళ్ళు తాము బంగారు కంచాలమని చెప్పుకుంటున్నా తెలుగు రాజకీయాలలో మాత్రం ఏదో ఒకపార్టీ గోడ చేర్పు కావాల్సినట్టుగా కాలం వెళ్లదీస్తున్న పార్టీలు. తెలుగుదేశం పార్టీతో కొన్నాళ్లు… చిన్నా చితకా పార్టీలతో ఇంకొన్నాళ్ళు కలిసి ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్న పార్టీలు వామపక్షాలు. ఈసారి మాత్రం ఎన్నికలకు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేతులు […]
వామపక్షాలు. సిపిఐ, సిపిఎం పార్టీలు. బడుగు, బలహీన పేద వర్గాలకు చెందిన పార్టీలుగా పేరు తెచ్చుకున్న కమ్యూనిస్టు పార్టీలు. వాళ్లకు వాళ్ళు తాము బంగారు కంచాలమని చెప్పుకుంటున్నా తెలుగు రాజకీయాలలో మాత్రం ఏదో ఒకపార్టీ గోడ చేర్పు కావాల్సినట్టుగా కాలం వెళ్లదీస్తున్న పార్టీలు.
తెలుగుదేశం పార్టీతో కొన్నాళ్లు… చిన్నా చితకా పార్టీలతో ఇంకొన్నాళ్ళు కలిసి ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్న పార్టీలు వామపక్షాలు. ఈసారి మాత్రం ఎన్నికలకు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేతులు కలిపాయి సిపిఐ, సిపిఎం.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం తో పాటు అనేక సమస్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలిసి పోరాటం కూడా చేశాయి. ఆ ఉద్యమాల సమయంలోనే రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తో కలిసి పోటీ చేస్తామని వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం బహిరంగంగా ప్రకటించాయి. పవన్ కళ్యాణ్ కూడా చీటికి మాటికి వామపక్షాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం, బహిరంగ సభల్లో మాట్లాడడం వంటివి చేశారు. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి పవన్ కల్యాణ్ ముఖం చాటేస్తున్నారని వామపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 25వ తేదీ నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజుగా ప్రకటించింది. అంటే సెలవులు మినహాయిస్తే కేవలం ఐదు రోజులు మాత్రమే నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం ఉంది.
పవన్ కల్యాణ్ మాత్రం ఇంతవరకు వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చించలేదన్నారు వామపక్షాల నేతలు. తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలి, లోక్ సభ కు ఎన్ని సీట్లు ఇస్తారు, శాసనసభకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారు వంటి అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత లేదని…. అయితే సీపీఐ, సీపీఎం లకు చెరో ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయని అంటున్నారు.
తమపట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు వామపక్షాల నాయకులు మండిపడుతున్నారు. ఒకవైపు తమతో సీట్ల సర్దుబాటు జరిగిందంటూనే…. మరో వైపు నలభై అసెంబ్లీ స్థానాలిస్తే టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన… టీడీపీతో రాయబారాలు నడపడం ఏమిటని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
సీట్ల సర్దుబాటు పూర్తి కాకపోవడంతో అభ్యర్థుల ఎంపిక కూడా పెండింగ్ లో పడింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ తో ఎన్నిసార్లు సమావేశమైనా సీట్ల సర్దుబాటు అంశంపై దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని వామపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం వల్లే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వామపక్షాల నేతలు అంటున్నారు. సిపిఐ, సిపిఎం కు చెందిన రాష్ట్ర నేతలతో సహా జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు తాము విడిగా పోటీ చేద్దామని ఒత్తిడి తీసుకు వస్తున్నారని సిపీఎంకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకోకపోతే తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారని చెబుతున్నారు.