Telugu Global
NEWS

పవన్ తో రాజకీయం ప్రారంభించిన చంద్రబాబు

నారా చంద్రబాబు నాయుడు. తెలుగు రాజకీయాలలో ఆరితేరిన వ్యూహకర్త. అధికారం కోసం ఎలాంటి పని అయినా చేసేందుకు సిద్ధపడే రాజకీయ నాయకుడు. మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లుగా తన అధికారాన్ని కాపాడుకోవడం, తిరిగి సంపాదించుకోవడమే లక్ష్యంగా పని చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నాయకుల తో సహా రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు బహిరంగంగానే చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి తన రాజకీయ […]

పవన్ తో రాజకీయం ప్రారంభించిన చంద్రబాబు
X

నారా చంద్రబాబు నాయుడు. తెలుగు రాజకీయాలలో ఆరితేరిన వ్యూహకర్త. అధికారం కోసం ఎలాంటి పని అయినా చేసేందుకు సిద్ధపడే రాజకీయ నాయకుడు.

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లుగా తన అధికారాన్ని కాపాడుకోవడం, తిరిగి సంపాదించుకోవడమే లక్ష్యంగా పని చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నాయకుల తో సహా రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు బహిరంగంగానే చెప్తారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ను, భారతీయ జనతా పార్టీ లను ఉపయోగించుకొని అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి ఆ ఇద్దరి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

అయితే తన వ్యూహరచనలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు చేయకుండా… తన పార్టీ వారిని కూడా ఎలాంటి విమర్శలు చేయనియ్యకుండా జాగ్రత్తలు తీసుకున్న చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహానికి తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే 126 మంది అభ్యర్థులను ప్రకటించిన రోజే పవన్ తో కొత్త రాజకీయ వ్యూహాన్ని ప్రారంభించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారని…. లేదా… చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ఒక మెసేజ్ పంపుతారని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించిన మరునాడే “ కెసిఆర్ గారు ఆంధ్రులను వదిలేయండి” అంటు పవన్ కళ్యాణ్ చేత ఓ ప్రకటన ఇప్పించారు చంద్రబాబు నాయుడు.

ఇలాంటి ప్రకటనలు తాను చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించరని పూర్తిగా తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఈ పనిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. అంటే ఈ ప్రకటనతో మెల్లిమెల్లిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడం ప్రారంభించినట్లుగా అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అటు తెలుగుదేశం పార్టీని గానీ, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడిని కానీ పల్లెత్తు మాట అనకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన… ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకు పడటం ఈ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అంటున్నారు.

ఈ వ్యూహంలో భాగంగా ముందుగా కేసీఆర్ పై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ముందు ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

First Published:  14 March 2019 11:16 PM GMT
Next Story