సబితకు మంత్రి పదవి... ఒక దెబ్బకు రెండు పిట్టలు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ మరోసారి తన రాజకీయ వ్యూహానికి తెరతీసారు. ఈ సారి ఈ కొ్త్త వ్యూహంతో అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడమే కాదు… సొంత పార్టీలో మహిళా శాసన సభ్యురాళ్లకు కూడా ఓ ఝలక్ ఇచ్చేలా ఆయన తన వ్యూహాన్ని రచిస్తున్నారంటున్నారు. తెలంగాణలో తొలి సారి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కాని…. ఇటీవల రెండో సారి ప్రభుత్వ […]
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ మరోసారి తన రాజకీయ వ్యూహానికి తెరతీసారు. ఈ సారి ఈ కొ్త్త వ్యూహంతో అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడమే కాదు… సొంత పార్టీలో మహిళా శాసన సభ్యురాళ్లకు కూడా ఓ ఝలక్ ఇచ్చేలా ఆయన తన వ్యూహాన్ని రచిస్తున్నారంటున్నారు.
తెలంగాణలో తొలి సారి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కాని…. ఇటీవల రెండో సారి ప్రభుత్వ ఏర్పాటులో కాని మహిళా శాసన సభ్యురాళ్లెవ్వరికీ సీఎం కల్వకుంట్ల వారు మంత్రి పదవి ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో అయితే కనీసం డిప్యూటీ స్పీకర్ పదవి అయినా కట్టబెట్టారు. ఈసారి అది కూడా లేకుండా చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.
అంతే కాదు… తొలి శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ శాసనసభ్యురాళ్ల చేత ఇదే విషయాన్ని అడిగించి ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టారు కాంగ్రెస్ నాయకులు. ఆ సమయంలో మహిళ మంత్రి లేరనే విషయాన్ని ప్రస్తావించినది కూడా చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి.
అయితే ఆ విమర్శకు ధీటుగా సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి త్వరలోనే మంత్రిగా మహిళా శాసనసభ్యురాలు ప్రమాణం చేస్తారని ప్రకటించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు విషయం ప్రారంభమైంది.
తన కుమారుడికి చెవెళ్ల లోక్ సభ అభ్యర్ధి టిక్కట్ తో పాటు తనకు మంత్రి పదవి ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతానంటూ సబితా ఇంద్రారెడ్డి బేరసారాలు చేశారు. అది కూడా సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల ముందు.
అంతే ఈ డిమాండ్ కు అంగీకరించిన సీఎం కె.చంద్రశేఖర రావు ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వ్యవహరించాలనుకున్నారని అంటున్నారు. ఇందులో ఒక పిట్ట కాంగ్రెస్ పార్టీ అయితే… మరో పిట్ట తన పార్టీలోని మహిళా శాసన సభ్యురాలే అంటున్నారు. శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతనైతే విమర్శ చేయించిందో ఆ సబితా ఇంద్రారెడ్డికే మంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నేతలకు దిమ్మ తిరిగిపోయే చర్య అంటున్నారు.
ఇక పార్టీలో సీనియర్ అని చెప్పుకుంటున్న, మాజీ మంత్రి హరీష్ రావు వర్గమని అందరూ భావిస్తున్న ఓ మహిళా శాసనసభ్యురాలికి కూడా మంత్రి పదవి ఇవ్వకుండా చెక్ పెట్టడమే రెండో పిట్టను కొట్టడం అంటున్నారు.
సబితా ఇంద్రారెడ్డి…. తెలంగాణ రాష్ట్ర సమితిలో మంత్రి పదవి ఆశిస్తున్న శాసనసభ్యురాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక ఆమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదంటున్నారు.
ఇది పార్టీలో ఉన్న వారికి పరోక్షంగా ఫలానా వర్గమని, ఫలానా గ్రూప్ అని చెప్పుకోకుండా ఉండేందుకు కూడా ఈ చర్య ఉపకరిస్తుందన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇదే కేసీఆర్ ఒక దెబ్బకు రెండు పిట్టల వ్యూహమని అంటున్నారు.