మీరు ఎమ్మెల్యేలను కాపాడుకో లేరు.... నేను వచ్చి ఏమి ఉపయోగం: రాహుల్ గాంధీ
కొన్ని గంటల పర్యటనకు హైదరాబాద్ వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పై సీరియస్ అయ్యారు. ఇటీవల ముగిసిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సరైన వ్యూహరచన చేయలేదని, గ్రూపు గొడవల కారణంగా తెలంగాణలో అధికారం చేజేతులా పోగొట్టుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో దాదాపు రెండు లక్షల మందిని సమీకరించి సభ ఏర్పాటు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. జన […]
కొన్ని గంటల పర్యటనకు హైదరాబాద్ వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పై సీరియస్ అయ్యారు. ఇటీవల ముగిసిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సరైన వ్యూహరచన చేయలేదని, గ్రూపు గొడవల కారణంగా తెలంగాణలో అధికారం చేజేతులా పోగొట్టుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో దాదాపు రెండు లక్షల మందిని సమీకరించి సభ ఏర్పాటు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. జన సమీకరణకు కాంగ్రెస్ నాయకులు చేతులెత్తేయడంతో నగర శివారుతో పాటు చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోనే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశం నిర్వహణ బాధ్యతలు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన భుజాలకు ఎత్తుకున్నారు.
హైదరాబాద్ చేరుకున్న తర్వాత కానీ ఈ విషయం తెలియని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
“ఇప్పుడు భారీ సమావేశం ఏర్పాటు చేయమని మీకు ఎవరు చెప్పారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోకుండా సభలు, సమావేశాలు పెట్టి నన్ను ఆహ్వానిస్తే సరిపోతుందా” అని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలపై మండిపడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
దీంతోపాటు ఇటీవల పార్టీని వదిలి టిఆర్ఎస్ లో చేరుతున్న ముగ్గురు ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా తీసుకొచ్చిన రాహుల్ గాంధీ ఆ అంశంపై టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు చెబుతున్నారు. “మన గుర్తుమీద గెలిచిన ఎమ్మెల్యేలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు అంటే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి. ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి కూడా మీ దగ్గర లేదా?” అని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.
పార్టీలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ నాయకుల కొందరు కోవర్టులుగా పని చేస్తున్నారని తన వద్ద నివేదిక ఉందని, వారు అలా మారడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులే కారణమని మండి పడినట్లు సమాచారం.
“ గ్రూపు రాజకీయాలు వదలరు. దాని వల్ల పార్టీ సర్వనాశనం అయినా మీకు సంబంధం లేదు. మీరు మారకుంటే… ఇలాగే పనిచేస్తామని భీష్మించి కూర్చుంటే జాతీయ అధ్యక్షుడిగా నా పని నేను చేసుకు పోతాను. ఆ తర్వాత మీ ఇష్టం” అని రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడినట్లు సమాచారం.