Telugu Global
International

లండన్‌లో దర్జాగా నివసిస్తున్న నీరవ్ మోడీ.... ది టెలిగ్రాఫ్ కథనం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీ జాడను ది టెలిగ్రాఫ్ పత్రిక బయటపెట్టింది. ఒక వైపు భారతీయ దర్యాప్తు సంస్థలు నీరవ్ మోడీ కోసం గాలిస్తున్నామని.. అతడు ఎక్కడ ఉన్నాడో కచ్చితంగా తెలియదని చెబుతుంటే.. అతను మాత్రం లండన్‌లో దర్జాగా తిరుగుతున్నాడు. లండన్‌కు చెందిన ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక అతడిని కొద్ది సేపు ఇంటర్వ్యూ కూడా చేయడం గమనార్హం. లండన్‌లోని వెస్ట్ఎండ్ ప్రాంతంలోని […]

లండన్‌లో దర్జాగా నివసిస్తున్న నీరవ్ మోడీ.... ది టెలిగ్రాఫ్ కథనం
X

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీ జాడను ది టెలిగ్రాఫ్ పత్రిక బయటపెట్టింది. ఒక వైపు భారతీయ దర్యాప్తు సంస్థలు నీరవ్ మోడీ కోసం గాలిస్తున్నామని.. అతడు ఎక్కడ ఉన్నాడో కచ్చితంగా తెలియదని చెబుతుంటే.. అతను మాత్రం లండన్‌లో దర్జాగా తిరుగుతున్నాడు.

లండన్‌కు చెందిన ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక అతడిని కొద్ది సేపు ఇంటర్వ్యూ కూడా చేయడం గమనార్హం. లండన్‌లోని వెస్ట్ఎండ్ ప్రాంతంలోని విలాసవంతమైన త్రీ బెడ్రూం ఫ్లాట్‌లో నీరవ్ అద్దెకు ఉంటున్నాడు. నెలకు 15 లక్షల రూపాయల అద్దె కడుతూ అదే లండన్‌లో తన వజ్రాల వ్యాపారాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.

లండన్ వీధుల్లో నీరవ్ మోడీ 9 లక్షల విలువైన ‘ఆస్ట్రిచ్ హైడ్’ జాకెట్ ధరించి నడుస్తుండగా ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక జర్నలిస్టుకు ఎదురు పడ్డాడు. ఈ సందర్భంగా పీఎన్‌బీ స్కాం, వ్యాపారం, బ్రిటన్‌లో నివాసం తదితర అంశాలపై ప్రశ్నించగా ‘నో కామెంట్’ అంటూ తప్పించుకున్నాడు. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు.

నీరవ్ మోడీకి బ్రిటన్ ప్రభుత్వం జాతీయ భీమా నెంబర్‌ను కూడా కేటాయించింది. దీని ద్వారా నీరవ్ అక్కడ పని చేసుకోవచ్చు.. అంతే కాకుండా రిటైర్ అయ్యాక పెన్షన్ కూడా అందుకునే అర్హత పొందాడు. తన బ్యాంకు అకౌంట్లను కూడా అన్‌లైన్ ద్వారా ఆపరేట్ చేసుకునే వెసులు బాటు కలిగిందని ఆ పత్రిక పేర్కొంది. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడిగా ముద్రపడిన నీరవ్‌కు ఎలా బ్రిటన్ ప్రభుత్వం ఇన్స్యూరెన్స్ నెంబర్ వచ్చిందని ప్రశ్నించగా…. దానికి కూడా సమాధానం దాటవేశాడు.

పీఎన్‌బీని 13,600 కోట్ల రూపాయల మేర నీరవ్ మోడీ, అతని మామ మోహుల్ చోక్సీలు మోసం చేశారు. నీరవ్ బ్రిటన్‌లో నివసిస్తుండగా.. చోక్సీ ఇటీవలే ఆంటిగ్వా అండ్ బార్బడా పౌరసత్వం సంపాదించి అక్కడే స్థిరపడ్డాడు. అక్కడి చట్టాల ప్రకారం వీరిని దేశానికి తిరిగి తీసుకొని రావాలంటే కష్టపడాల్సిందే.

First Published:  9 March 2019 1:35 PM IST
Next Story