భీమిలీ మెడలో “ గంట” కట్టిన చంద్రబాబు!
భీమిలి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న నియోజకవర్గం. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా మున్సిపాలిటీ గా ఎంపికైన పట్టణం. సముద్ర తీర పట్టణం కావడంతో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేందాల్సిన పట్టణం. ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఈ నియోజకవర్గంలో ఎంతో ఉంటుంది. ఈ నిర్లక్ష్యమే స్థానిక నాయకులకు కలిసి వచ్చిన అంశం. రాష్ట్ర విభజన తర్వాత భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం పార్టీ లోకి, ఆ తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీలో […]
భీమిలి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న నియోజకవర్గం. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా మున్సిపాలిటీ గా ఎంపికైన పట్టణం. సముద్ర తీర పట్టణం కావడంతో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేందాల్సిన పట్టణం. ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఈ నియోజకవర్గంలో ఎంతో ఉంటుంది. ఈ నిర్లక్ష్యమే స్థానిక నాయకులకు కలిసి వచ్చిన అంశం.
రాష్ట్ర విభజన తర్వాత భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం పార్టీ లోకి, ఆ తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన గంటా శ్రీనివాసరావుకు పార్టీ అధినేత మంత్రి పదవి ఇచ్చారు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి అంటూ సొంత పార్టీకి చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు తో సహా ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోశాయి. దీంతో విశాఖ జిల్లా మొత్తం మీద తెలుగుదేశం పార్టీ పరువు సముద్రం పాలయింది. చేసేది లేక అన్యాక్రాంతమైన భూములపై ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య పచ్చ గడ్డి కాదు సముద్రపు ఒడ్డున ఉన్న తడి మట్టి కూడా మండిపోతోందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నారు.
సరిగ్గా ఈ సమయంలోనే శాసన సభ ఎన్నికలు వచ్చాయి. మంత్రి గంటా శ్రీనివాసరావుపై రోజురోజుకూ పెరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో తల పట్టుకుని కూర్చున్న చంద్రబాబునాయుడుకు గొప్ప అవకాశం దొరికింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా చివరి నిమిషంలో తనకు ఝలక్ ఇచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్ ను ఓడించడం ఒకపక్క…. భూముల కుంభకోణంలో నిండా మునిగిపోయిన గంటా శ్రీనివాసరావును తప్పించడం మరోపక్క అనే ఆయుధాలతో భీమిలి నుంచి తన కుమారుడు నారా లోకేష్ ను ఎన్నికల బరిలో దించేందుకు పావులు కదుపుతున్నారు.
ఇన్నాళ్లుగా భీమిలి మెడలో గంట కట్టాలని అనుకుంటున్నా…. ఎవరికీ సాధ్యం కాని పనిగా మిగిలిపోయింది. చివరికి ఆ పనిని చంద్రబాబు నాయుడే తలకెత్తుకున్నారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావును తప్పించి….సరికొత్త వ్యూహంలో భాగంగా తన కుమారుడు నారా లోకేష్ ను అక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. ఇక గంటా శ్రీనివాసరావుకు విశాఖ పార్లమెంట్ స్థానం గానీ, నగరంలోని ఖాళీగా మిగిలిన ఉత్తర నియోజకవర్గం గాని కేటాయించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం పార్లమెంటుకు పోటీ చేసేది లేదని, తనకు విశాఖ పశ్చిమ నియోజక వర్గాన్ని కేటాయించాలంటూ చంద్రబాబుని కోరుతున్నారు. గంటా శ్రీనివాసరావు కోరికను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వినే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. అదే జరిగితే గంటా శ్రీనివాసరావు తన దారి తాను చూసుకుంటారని కూడా జిల్లా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.