ఎన్నికల్లో మాకు మాకే పోటి.... ప్రతిపక్షంతో కాదు...!
తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేపట్టిన ఉత్సాహంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతోంది. దీనిలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మెదక్ నియోజకవర్గ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈ ఎన్నికలు పార్టీల మధ్య పోటీ […]
తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేపట్టిన ఉత్సాహంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతోంది. దీనిలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మెదక్ నియోజకవర్గ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈ ఎన్నికలు పార్టీల మధ్య పోటీ కాదని.. తమ అభ్యర్థుల మధ్యే పోటీ అని స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ సాధించాలనే దానిపైనే మన గురి ఉండాలని కేటీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. మెజార్టీతో రికార్డులు సృష్టించాలన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో.. మనం 17 సీట్లు గెలిస్తే ఢిల్లీని శాసించొచ్చని ధీమా వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదని.. అదే మనం నిర్ణయాత్మక శక్తిగా ఉంటే అలాంటివి సాధించడం సులభమవుతుందని కేటీఆర్ చెప్పారు. మన పథకాలకు కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప నిధులు రాలేదని ఆయన ఆరోపించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం ఒక్క రూపాయి కూడా విదల్చలేదన్నారు.
తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాలే కాక.. కేంద్రం కూడా కాపీ కొడుతోందన్నారు. నిత్యం కేసీఆర్‌ను విమర్శించే చంద్రబాబు కూడా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టారని కేటీఆర్ విమర్శించారు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధులు కావాలంటే పార్లమెంటు సీట్లు ఎక్కువగా గెలిపించడానికి అందరూ కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు స్పష్టం చేశారు.