Telugu Global
NEWS

ఖమ్మం... సికింద్రాబాద్ నుంచి వైఎస్ఆర్ సీపీ పోటీ?

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ స‌భ‌ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనుందా? తెలంగాణలో వైసీపీకి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోందా? అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు. తెలంగాణ శాస‌న‌స‌భ  ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గం నుంచి బరిలో లేదు. తమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమని, ఆ శాసనసభ ఎన్నికల్లో అక్కడి లోక్ స‌భ‌ […]

ఖమ్మం... సికింద్రాబాద్ నుంచి వైఎస్ఆర్ సీపీ పోటీ?
X

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ స‌భ‌ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనుందా? తెలంగాణలో వైసీపీకి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోందా? అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.

తెలంగాణ శాస‌న‌స‌భ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గం నుంచి బరిలో లేదు. తమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమని, ఆ శాసనసభ ఎన్నికల్లో అక్కడి లోక్ స‌భ‌ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం తప్ప తెలంగాణలో పోటీ చేసేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రకటించారు.

అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా రానున్న లోక్ సభ ఎన్నికలలో తమకు పట్టున్న ఖమ్మం, సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. గత లోక్ స‌భ‌ ఎన్నికలలో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అఖండ విజయం సాధించారు. అనంతర పరిణామాలు…. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అక్క‌డ కూడా ఆయ‌న‌ అసంతృప్తితోనే ఉన్నారంటున్నారు.

రానున్న ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి ఆయనకు తెలంగాణ రాష్ట్ర సమితి టిక్కెట్ ఖరారు చేసినా పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజ‌యం సాధించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాల్లో తమకు పట్టు ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం.

సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని లోక్ సభ ఎన్నికల బరిలో దించాలని భావిస్తోంది. మాజీ ఎమ్మెల్యే, అలనాటి హీరోయిన్ జయసుధ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెను సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో బరిలో దింపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

గత లోక్ స‌భ‌కు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా ఆయనకే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ లోక్ స‌భ‌ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి చెందిన అభ్యర్థి ఎవరు ఎన్నికల బరిలో నిలుస్తారో ఇంకా తేలలేదు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సెటిలర్లు అధికంగా ఉండటంతో ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు సినీ గ్లామరు కూడా జయసుధకు కలిసి వస్తుందని అంటున్నారు. తెలంగాణలో తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడం లో భాగంగా ఖమ్మం, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాల నుంచి ఈసారి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

First Published:  8 March 2019 12:56 AM GMT
Next Story