జార్ఖండ్ క్రికెట్ స్టేడియంలో ధోనీ పేరుతో పెవీలియన్
స్టేడియం నార్త్ స్టాండ్ కు ధోనీ పెవీలియన్ గా నామకరణం జార్ఖండ్ స్టేడియం వేదికగా ఆసీస్ తో రేపే మూడో వన్డే భారత క్రికెట్ కు రెండు ప్రపంచకప్ లతో సహా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన రాంచీ ముద్దుబిడ్డ, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ..జార్ఖండ్ క్రికెట్ సంఘం ఓ అరుదైన రీతిలో గౌరవించింది. గత 15 ఏళ్లుగా తమ రాష్ట్రానికి, దేశానికి ఎనలేని సేవలు అందించడం తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు […]
- స్టేడియం నార్త్ స్టాండ్ కు ధోనీ పెవీలియన్ గా నామకరణం
- జార్ఖండ్ స్టేడియం వేదికగా ఆసీస్ తో రేపే మూడో వన్డే
భారత క్రికెట్ కు రెండు ప్రపంచకప్ లతో సహా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన రాంచీ ముద్దుబిడ్డ, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ..జార్ఖండ్ క్రికెట్ సంఘం ఓ అరుదైన రీతిలో గౌరవించింది.
గత 15 ఏళ్లుగా తమ రాష్ట్రానికి, దేశానికి ఎనలేని సేవలు అందించడం తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ధోనీ పేరుతో… రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ సంఘం ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓ స్టాండ్ ఏర్పాటు చేసింది.
స్టేడియం ఉత్తరభాగంలో నిర్మించిన పెవీలియన్ కు…ఎం. ఎస్. ధోనీ పెవీలియన్ అని నామకరణం చేశారు.
అయితే…ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేకు ముందే…ఈ పెవీలియన్ ను…ధోనీతోనే ప్రారంభించాలని జార్ఖండ్ క్రికెట్ సంఘం చేసిన ప్రయత్నం ఫలించలేదు. తన పేరుతో ఏర్పాటు చేసిన పెవీలియన్ ను ప్రారంభించడానికి ధోనీ నిరాకరించాడు. ఎవరైనా తన సొంతఇంటిని ప్రారంభిస్తారా అంటూ.. తన దైన శైలిలో ప్రశ్నించాడు.
లిటిల్ మాస్టర్ల పేర్లతో స్టాండ్లు…
విఖ్యాత క్రికెటర్ల పేర్లతో స్టేడియాలు నిర్మించడం, పెవీలియన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారికాదు. ధోనీకి ముందే…లిటిల్ మాస్టర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్ పేర్లతో…ముంబై క్రికెట్ సంఘం..వాంఖెడీ స్టేడియంలో స్టాండ్ లు ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ లోనూ….
హైదరాబాద్ క్రికెట్ సంఘం సైతం…మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, వీవీఎస్ లక్ష్మణ్ ల పేరుతో…హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పెవీలియన్ తో పాటు క్రికెట్ స్టాండ్ లను ఏర్పాటు చేసి గౌరవించింది.
క్రికెటర్ల పేరుతో స్టేడియాలు….
మనదేశంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లుతో మాత్రమే క్రికెట్ స్టేడియాలు నిర్మించడం తెలుసు. అయితే…వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు చెందిన కరీబియన్ ద్వీపాలలో మాత్రం… తమతమ దేశాలకు చెందిన విశ్వవిఖ్యాత క్రికెటర్ల పేరుతోనే స్టేడియాలను నిర్మించి..గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది.
కరీబియన్ ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్ పేరుతో…ఆంటీగా ద్వీపంలోని నార్త్ సౌండ్ లో ఓ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్మించారు. అంతేకాదు…సెయింట్ లూసియాలో మాజీ కెప్టెన్ డారెన్ సామీ పేరుతో సైతం ఓ స్టేడియాన్ని నిర్మించారు.
టీ-20 ప్రపంచకప్ టోర్నీలో విండీస్ ను విశ్వవిజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర వహించిన కెప్టెన్ కమ్ ఆల్ రౌండర్ డారెన్ సామీని…ఆ దేశ ప్రభుత్వం సముచితంగా సత్కరించింది.
మొత్తం మీద..తమ తమ దేశాలతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన క్రికెట్ దిగ్గజాల పేరుతో స్టేడియాలు, పెవీలియన్లు ఏర్పాటు చేయటాన్ని మించిన గౌరవం మరొకటి లేదనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు.